నిజామాబాద్, ఆగస్టు 23: జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే తపనతో ముందుకు సాగుతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు ఇంజినీరింగ్, వ్యవసాయ కళాశాల తీసుకొచ్చామని, ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయని తెలిపారు. లింబాద్రి గుట్టపై గెస్ట్‌హౌస్ నిర్మాణం చేపడుతున్నామని, రాష్ట్రంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు నిజామాబాద్ జిల్లాకే మంజూరు చేశామని చెప్పారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ టవర్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించామని తెలిపారు.
ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో పాటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సహకార సంఘాల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు కల్పిస్తున్నామని చెప్పారు. బీజేపీ నేతలు నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయలేకపోయారని, ఇప్పుడు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆర్మూర్‌లో పామాయిల్ పరిశ్రమ రాబోతోందని, వ్యవసాయ రంగంలో నిజామాబాద్ రాష్ట్రంలోనే మేటి జిల్లాగా నిలుస్తోందని అన్నారు. జిల్లా అభివృద్ధినే ధ్యేయంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
వార్తలు కూడా చదవండి...

