Dailyhunt
నిరంతర నిఘాతో కలప స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట- అల్లోల

నిరంతర నిఘాతో కలప స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట- అల్లోల

ఆదిలాబాద్‌: అడవుల రక్షణ చర్యల్లో భాగంగా అడవిలోకి ఇతరులు ప్రవేశించకుండా దారులను మూసేందుకు కంచెలు, కందకాలు ఏర్పాటు చేశామని అటవీ,పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. అటవీ సంపదను కాపాడేందుకు పోలీసుశాఖ సహాయంతో అటవీ అధికారులు అహర్నిశలూ కృషి చేస్తున్నారని చెప్పారు. అడవుల సంరక్షణ పై ప్రజల్లో అవగాహన పెరిగిందని, వారి భాగస్వామ్యంతో నిరంతర నిఘా వల్ల కలప స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయగలిగామన్నారు. హరితహారంలో భాగంగా క్షీణించిన అడవుల్లో పెద్దయెత్తున మొక్కలు పెంచడమే కాకుండా అటవీ సంపదను కాపాడేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా బోధ్‌ నియోజక వర్గంలోని నేరడిగొండ మండలం బోరిగాం, బోధ్‌ మండలం కోట-బి గ్రామాల్లో మంత్రి అల్లోల మొక్కలు నాటారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన విప్లవాత్మకమైన పంచాయితీరాజ్‌, పురపాలక చట్టాలతో పచ్చదనం పెంపునకు ఆధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. నాటిన మొక్కలలో కనీసం 85శాతం మొక్కలను కాపాడే బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులపై ఉందని పేర్కొన్నారు. గ్రామ పంచాయితీల్లో పచ్చదనానికి పదిశాతం నిధులు కేటాయించారన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రతి గ్రామ పంచాయితీలో నర్సరీలను ఏర్పాటు చేసి సరంక్షిస్తున్నారని, పచ్చదనం, పరిశుభ్రత కోసం ప్రతి గ్రామ పంచాయితీకి ట్రాక్టర్లను కూడా సమకూర్చారని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy