Monday, 08 Mar, 5.07 pm ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
నిరుద్యోగులు ఆలోచించాలి: శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్: నిరుద్యోగులు ఆలోచించాలి.. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. లాభాల బాటలో ఉన్న కంపెనీలను కేంద్ర ప్రభుత్వం అమ్మేసి.. ఉద్యోగాలకు గండి పెడుతోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లాలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతు కావాలా.. పరిష్కరించే గొంతు కావాలా ఆలోచించాలని తెలిపారు. ఆరేళ్లు ఏమి ప్రశ్నించి.. ఏమి సాధించారో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ వకిలుగా.. తోటి వకిల్లే ఆయనను నమ్మడం లేదని ఎద్దేవా చేశారు.

సొంత ప్రొఫెషన్ వారికే న్యాయం చెయని వ్యక్తి.. ఇతరులకి ఏమి న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు.. మరీ ఇచ్చారా అని నిలదీశారు. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు.. కుల.. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్న పార్టీలకు తెలంగాణలో స్థానం లేదన్నారు. ఉద్యోగులకి రిటైర్మెంట్ వయస్సు పెంచుతామన్నారు. ఉద్యోగులు సంతృప్తి చెందే విధంగా తాము చేస్తాం.. మరి.. వాళ్లు గెలిస్తే ఇవి చేయగలరా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు.రామచంద్రరావు ఇప్పటికైనా సీపీఎస్ రద్దు చేయిస్తానని ప్రకటన చేయాలని నిలదీశారు. మీరు వ్యాపారంలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. తాము ప్రధానమంత్రి నరేంద్రమోదీని గౌరవిస్తాం.. మాకు సభ్యత సంస్కారం.. ఉంది.. కానీ బీజేపీ నాయకులకు సంస్కారం లేదని ధ్వజమెత్తారు. ఇది అందరూ గమనిస్తున్నారు.

కరెంటు విషయంలో సాధించిన ప్రగతి.. దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. తెలంగాణ వచ్చిన రెండేళ్లలోనే.. రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం. పరిశ్రమలకు సబ్సిడీపై కరెంటు ఇస్తున్నాం. ఇలాంటి ఏ స్కీములు కూడా పక్క రాష్ట్రల్లో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి తాము చూస్తుంటే.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు నచ్చడం లేదని మండిపడ్డారు. వచ్చే పదేళ్లు టీఆర్ఎస్‌ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి.. మన జిల్లా వాసి.. మన జిల్లా వాసికి ఓటు వేయాల్సిన బాధ్యత మనదన్నారు. ఓటేసి వాణీదేవిని గెలిపిస్తే ఉమ్మడి జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top