Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్ పేపర్ లీక్ కేసు.. బిహార్‌లో మళ్లీ విద్యార్థుల ఆందోళనలు

నీట్ పేపర్ లీక్ కేసు.. బిహార్‌లో మళ్లీ విద్యార్థుల ఆందోళనలు

ఇంటర్నెట్ డెస్క్: నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశాన్ని వ్యతిరేకిస్తూ బిహార్‌లో విద్యార్థులు మరోసారి నిరసన బాటపట్టారు. గత నెలలో జరిగిన నిరసనల్లో అరెస్టైన విద్యార్థులను విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి..

దానిని నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ వందలాది మంది విద్యార్థులు, యువజన సంఘాల కార్యకర్తలు మంగళవారం పట్నాలో ఆందోళనకు దిగారు.

కాగా.. గాంధీ మైదాన్ వద్ద నుంచి సీఎం సమ్రాట్ చౌదరి నివాసం వైపు ర్యాలీగా బయల్దేరిన నిరసనకారులను.. ఇన్‌కమ్ ట్యాక్స్ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి ఇంటికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోనే వారిని నిలువరించారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు. అయితే.. నిషేధిత ప్రాంతంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వాటర్ కేనన్లు ఉపయోగించామని పోలీసులు తెలిపారు.

గత నెలలో నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటనపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిర్వహించిన బంద్ సందర్భంగా సుమారు 600 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిలో సగం మందిని మైనర్లుగా గుర్తించి విడుదల చేయగా, మిగిలిన వారిని జైలుకు తరలించారు. ఆ తర్వాత కేసులను ఉపసంహరించుకుంటామని రాష్ట్ర హోంశాఖ ప్రకటించినప్పటికీ.. ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఎంతమంది విద్యార్థులు విడుదలయ్యారు?, ఎంతమంది జైలులో ఉన్నారనే విషయంపై అధికారిక జాబితాను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే.. ఈ నిరసనలకు స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ రామ్ మద్దతు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy