Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నితీశ్ కుమార్ రెడ్డికి గాయం.. ఐర్లాండ్ సిరీస్‌కు దూరం

నితీశ్ కుమార్ రెడ్డికి గాయం.. ఐర్లాండ్ సిరీస్‌కు దూరం

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టు జూన్ 26 నుంచి రెండు టీ20ల సిరీస్‌ కోసం ఐర్లాండ్‌లో పర్యటించనుంది. భారత యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.

ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో నితీశ్ తొడ కండరాలకు గాయమైంది. దీనివల్ల ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో కూడా నితీశ్ ఆడకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నితీశ్ రెడ్డి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లనున్నాడు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం గాయం తీవ్రత, కోలుకునేందుకు పట్టే సమయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై స్పష్టత లేదు.

23 ఏళ్ల నితీశ్ రెడ్డిని భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం వన్డే, టీ20 జట్లలో ఎంపిక చేసింది. హార్దిక్ పాండ్య గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉండటంతో ప్రధాన సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా అతడిపై సెలక్టర్లు ఆశలు పెట్టుకున్నారు. అయితే గాయం కారణంగా నితీశ్ కూడా జట్టుకు దూరమవ్వడం భారత్‌కు ఎదురుదెబ్బగా మారింది. గతేడాది నుంచి వరుస గాయాలు నితీశ్ కెరీర్ పురోగతిని దెబ్బతీస్తున్నాయి. ఐపీఎల్ 2025లో ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతడు 13 మ్యాచ్‌ల్లో కేవలం ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అనంతరం ఇంగ్లండ్ టెస్టు పర్యటన మధ్యలోనే మోకాలి గాయంతో జట్టును వీడాల్సి వచ్చింది. అయితే ఐపీఎల్-2026లో తన ఫిట్‌నెస్ మెరుగుపర్చేందుకు నితీశ్ తీవ్రంగా శ్రమించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మంచి ఫామ్‌లో ఉన్న నితీశ్ ఇలాంటి సమయంలో గాయపడటం అతడికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.


ఫిఫా ప్రపంచ కప్: ఎంబాపె జోరు.. నాకౌట్‌కు ఫ్రాన్స్

వన్డే ప్రపంచ కప్‌లో రో-కో ఆడతారు: కైఫ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy