Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నోటీసులిచ్చినా.. సగం మంది నో!

నోటీసులిచ్చినా.. సగం మంది నో!

  • 'సర్‌' ప్రక్రియలో గందరగోళం..

  • ఓటర్లకు తిప్పలు..

  • పలుమార్లు తిరగాల్సి రావడంతో అసంతృప్తి

  • ధ్రువపత్రాలు చూపడంలో ఇబ్బంది

  • ఈఆర్వోల ఎదుట హాజరుపై అనాసక్తి

  • తప్పులున్నట్టు గుర్తించిన 92.88 లక్షల

  • మందిలో 30.7లక్షల మందికే నోటీసులు

  • విచారణకు రానివారు 17 లక్షల మంది

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన 'సర్‌' ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోంది. వివరాల్లో తప్పులున్నట్టు గుర్తించిన ఓటర్లకు నోటీసుల జారీ, విచారణ ప్రహసనంగా మారుతోంది. చాలా మంది ఓటర్లకు బీఎల్‌వోల నుంచి నోటీసులు అందలేదు. అందినా ఇచ్చిన గడువులో వెళ్లలేక, తగిన ధ్రువపత్రాలు చూపలేక, ఈఆర్వోల ఎదుట విచారణకు హాజరవడంపై ఆసక్తి లేక.. వచ్చినా నోటీసు పత్రాలు పట్టుకుని ఫొటోలు దిగడంపై ఇష్టం లేక.. ఇలా 90శాతం మంది విచారణకు వెళ్లడం లేదు. తప్పులున్నట్టు గుర్తించిన 92,88,110 లక్షల మంది ఓటర్లలో ఇప్పటివరకు 30,75,624 లక్షల మందికి మాత్రమే నోటీసులు అందజేయగా.. అందులో 17,13,949 మంది విచారణకు హాజరుకాక, నోటీసుల గడువు కూడా ముగిసిపోయింది. ఎన్నికల అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం నాటికి 1,73,851 మంది (ఆరుశాతం మేర) ఓటర్లకు సంబంధించి మాత్రమే విచారణ మొదలైంది. మిగతా ఓటర్లకు సంబంధించి విచారణ చేపట్టాల్సి ఉంది. విచారణ మొదలైన ఓటర్లలో.. ఇప్పటివరకు 20,199 మందికి సంబంధించి అన్ని రకాల విచారణ పూర్తయింది. 69,520 కేసులు పెండింగ్‌లో పెట్టారు. ఇక 85,052 నోటీసుల్లో విచారణ తుదిదశకు చేరగా.. మిగతా నోటీసుల్లో పరిశీలన, విచారణ, ధ్రువీకరణ, అర్హత నిర్ధారణ వరకు వివిధ దశల్లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. విచారణకు హాజరుకాని వారికి మరోసారి నోటీసులు జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఓటర్లకు సంబంధించి పేర్లలో అక్షర దోషాలు, అడ్రస్‌, ఇతర చిన్న తప్పులను ఈఆర్‌వోలే సరిచేస్తున్నారని, దానితో కొంతమందికి నోటీసులు జారీ చేయాల్సిన అవసరం రావడం లేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. 'సర్‌' నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ పట్టణ ప్రాంతాల్లో నత్తనడకన సాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి 12,53,876 నోటీసులు సిద్ధంచేయగా.. 5,30,161 మందికి జారీచేశారు. ఇంకా 7,23,715 నోటీసులు ఇవ్వాల్సి ఉంది. 1,52,574 నోటీసులలో విచారణ గడువు ముగిసింది. రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో కలిపి 12,33,485 నోటీసులు సిద్ధం చేయగా, 3,61,655 నోటీసులే జారీ చేశారు. మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కలిపి 14,07,317 నోటీసులకుగాను 1,43,830 నోటీసులు మాత్రమే ఓటర్లకు అందజేశారు. నిజామాబాద్‌ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో కలిపి 4,32,401 నోటీసులు సిద్ధంచేయగా, 1,43,503 మందికే జారీ చేశారు. 15,583 నోటీసులలో విచారణ జరపగా, 57,388 నోటీసుల గడువు ముగిసింది. ఇలా నత్తనడకన సాగుతుండటంతో నిర్ణీత షెడ్యూల్‌లోపు ప్రక్రియ పూర్తిచేస్తారా అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి.

విచారణకు వచ్చింది పది మంది లోపే..

ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినా.. పట్టణాల్లో ఓటర్లు విచారణకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. విద్యావంతులు, ఉద్యోగులు ఉండే నియోజకవర్గాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ సెగ్మెంట్‌లో అత్యల్పంగా ఇద్దరు, సనత్‌నగర్‌లో 6, కంటోన్మెంట్‌లో 20, మలక్‌పేట 27, బహదూర్‌పురాలో 42, జూబ్లీహిల్స్‌లో 71 మంది ఓటర్లు మాత్రమే విచారణకు రావడం గమనార్హం. ఇక విచారణకు వచ్చినా, తగిన ధ్రువపత్రాలు సమర్పించని వారిని గడువు ముగిసిన కేటగిరీలో చేరుస్తున్నట్టు ఓ అధికారి చెప్పారు.

ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేయాలి: టీపీసీసీ

'సర్‌' ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా ముసాయిదా నుంచి తొలగించిన 73 లక్షల ఓట్లకు సంబంధించి ఇంటింటికీ వెళ్లి మళ్లీ తనిఖీ చేయాలని ఎన్నికల కమిషన్‌ను టీపీసీసీ కోరింది. ఈ మేరకు మంగళవారం టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ పులిపాటి రాజేశ్‌కుమార్‌, సభ్యుడు వాజిద్‌ హుసేన్‌ మంగళవారం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి సుదర్శన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. చాలా మంది ఓటర్లు ఎన్యుమరేషన్‌ పత్రాలు ఇచ్చినా తొలగించారని పేర్కొన్నారు.

9.07 లక్షల అభ్యంతరాలు: సీఈవో

'సర్‌'లో భాగంగా ముసాయిదా జాబితాలపై క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ 16 వరకు కొనసాగుతుందని, ఇప్పటివరకు 9.07 లక్షల దరఖాస్తులు అందాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి తెలిపారు. క్లెయిమ్స్‌, అభ్యంతరాల దాఖలుపై ఓటర్లకు మరింత అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లుపేర్కొన్నారు. ఓటర్లు అక్కడికి వెళ్లి ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించుకోవచ్చని. అవసరమైతే ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా క్లెయిమ్స్‌, అభ్యంతరాలను అక్కడే దాఖలు చేసుకునే వీలుకల్పిస్తున్నామని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

హిట్‌ అండ్‌ రన్‌ కేసు.. సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి కుమారుడి అరెస్టు

ఆ చోరీ ఇంటిదొంగల పనే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy