Tuesday, 11 Aug, 3.42 am ఆంధ్రజ్యోతి

ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
న్యాయ వ్యవస్థపైనే కుట్ర!

అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా జరుగుతున్న కుట్రపూరిత యత్నాలపై, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఈశ్వరయ్య జరిపిన సంభాషణపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చేత గానీ, మాజీ న్యాయమూర్తి చేత గానీ దర్యాప్తు చేయించాలని, అప్పుడే నిజానిజాలు వెల్లడవుతాయని సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి రామకృష్ణ తరఫు సీనియర్‌ న్యాయవాది వేణుగోపాలగౌడ హైకోర్టును అభ్యర్థించారు. హైకోర్టును రెడ్‌జోన్‌గా ప్రకటించాలని, ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ మృతిపై దర్యాప్తు చేయించాలంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టును అపఖ్యాతి పాల్జేయడానికే ఆ పిల్‌ దాఖలు చేశారని, అందువల్ల దానిని కొట్టివేయాలని ఇప్పటికే రిజిస్ట్రార్‌ జనరల్‌ కౌంటర్‌ దాఖలు చేయగా..

ఈ పిల్‌లో తనను ప్రతివాదిగా చేర్చుకుని, తన వాదనలను కూడా వినాలని అభ్యర్థిస్తూ రామకృష్ణ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం మరోమారు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వేణుగోపాల గౌడ వాదనలు వినిపిస్తూ.. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా పరిణామాలు నెలకొన్న నేపథ్యంలోనే తాము అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. ఆధారాల సమర్పణకు అనుమతి ఇవ్వాలని కోరారు.

న్యాయవ్యవస్థకు, సిటింగ్‌ న్యాయమూర్తులకు దురుద్దేశాలు అంటగట్టేలా, వారిని అపఖ్యాతి పాల్జేసేలా ఆ ఫోన్‌ సంభాషణ ఉందని తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఆలిండియా బీసీ ఫెడరేషన్‌ రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదులోని అంశాలు, హైకోర్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ విద్యార్థి సమాఖ్య దాఖలు చేసిన పిల్‌లోని అంశాలు ఒకేలా ఉన్నాయన్నారు. ఇదంతా కుట్రపూరితమన్న విషయం రామకృష్ణతో రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య జరిపిన సంభాషణలోనూ స్పష్టమైందని తెలిపారు. ఈ మూడింటికీ పరస్పర సంబంధముందని, అందుకే తాము ఈ పిల్‌లో జోక్యాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు.

ఆయన మీడియా ముందుకు వెళ్లొచ్చా?

విద్యార్థి సమాఖ్య తరఫు న్యాయవాది అద్నాన్‌ మహమ్మద్‌ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు సిటింగ్‌ న్యాయమూర్తిని అపఖ్యాతి పాల్జేసేందుకు యత్నించి, సస్పెండైన న్యాయాధికారి.. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను కాపాడతాననడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి మీడియా ముందుకు వెళ్లవచ్చా అని ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రయోజనం కోసమే రామకృష్ణ ఈ కేసులో జోక్యానికి అడుగుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపించారు. రామకృష్ణ పిటిషన్‌లో రాష్ట్రప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తాము కౌంటర్‌ దాఖలు చేస్తామన్నారు.

కేంద్రప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ హరినాథ్‌ వాదనలు వినిపిస్తూ.. కరోనా వ్యవహారంలో కేంద్రప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను హైకోర్టులో పాటించడం లేదని చెప్పడానికి విద్యార్థి సమాఖ్యకు ఎలాంటి అర్హతా లేదన్నారు. అదేవిధంగా న్యాయాధికారి రామకృష్ణకు సైతం అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసేందుకు అర్హత లేదని.. అయితే ఈ వ్యవహారంలో కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని తెలిపారు.

ఉపేక్షించకూడదు: సత్యప్రసాద్‌

హైకోర్టు తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదనలు వినిపించారు. హైకోర్టుకు అపకీర్తి తెచ్చిపెట్టే ప్రయత్నాలను ఉపేక్షించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆలిండియా బీసీ ఫెడరేషన్‌ రాసిన లేఖలోని అంశాలు, విద్యార్థి సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలు ఒకటేనని స్పష్టమవుతోందని.. ఆ లేఖకు, పిటిషన్‌కు మధ్య ఉన్న సంబంధంపై విచారణ జరిపించాలని కోరారు. ఆ రెండింటితో పాటు ఫోన్‌ సంభాషణను కూడా నిశితంగా పరిశీలించాలన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్నారు.

న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారితో పాటు సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దుర్భాషలాడుతున్న వారిపైనా విచారణ జరపాలని అభ్యర్థించారు. ధర్మాసనం స్పందిస్తూ.. 'మీడియా ముందుకు రావడం, ప్రకటనలు చేయడం వంటివి ప్రభుత్వ ఉద్యోగి 'కాండక్ట్‌ రూల్స్‌' అతిక్రమణ కిందకు రావా? వాటిపై ఏమంటారు? ముందస్తు అనుమతి లేకుండా రామకృష్ణ మీడియాతో ఎలా సంబంధాలు నెరపుతారు' అని రామకృష్ణ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇందుకు వేణుగోపాలగౌడ స్పందిస్తూ.. ఆయన ప్రవర్తనపై విచారణ జరపవచ్చని పేర్కొన్నారు. రామకృష్ణ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై అందరి వాదనలు ముగియడంతో ధర్మాసనం నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేసింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top