Dailyhunt
ఒక కోచ్‌గా గంభీర్‌కు అసలైన సవాళ్లు ముందున్నాయి: సౌరభ్ గంగూలీ

ఒక కోచ్‌గా గంభీర్‌కు అసలైన సవాళ్లు ముందున్నాయి: సౌరభ్ గంగూలీ

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ప్లేయర్‌గా, ఇప్పుడు కోచ్‌గా అతడి దూకుడుతనం మాత్రం తగ్గలేదు.

దానివల్ల పలుసార్లు గొడవలు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా ఉన్న సమయంలో విరాట్ కోహ్లీతో గొడవ కూడా అలాంటి కోవకు చెందినదే. అయితే గంభీర్ స్వభావంపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ స్పందించాడు. గౌతీకి పలు సూచనలు చేశాడు.

'గంభీర్ ఆగ్రహ స్వభావం క్రికెట్ ప్రపంచానికి కొత్తేమీ కాదు. అతడు కాస్త మొరటుగా, రూడ్‌గా ఉంటాడు. కానీ గుణం మాత్రం గొప్పది. ప్రత్యర్థులకు గట్టిపోటీనిచ్చే ప్లేయర్లలో గౌతీ ఒకడు. గంభీర్ జట్టు విజయమే లక్ష్యంగా పనిచేస్తాడు. ప్లేయర్లందరూ సమిష్టిగా ఉండాలని కోరుకుంటాడు. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు వచ్చాయి. అతడి నేతృత్వంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచ కప్ 2026 గెలుచుకుంది.

అయితే అతడికి అసలు పరీక్ష ముందుంది. సౌతాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్ 2027 గంభీర్ ముందున్న అతిపెద్ద లక్ష్యం. అక్కడి పరిస్థితులు అతడికి సవాలుగా మారుతాయి. అయినప్పటికీ అన్నింటినీ ఎదుర్కొని విజయవంతమవుతాడనే నమ్మకం నాకుంది. కొంచెం మొరటు స్వభావాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. అయితే గంభీర్ టెస్టు క్రికెట్ విషయంలో మాత్రం కాస్త మెరుగుపడాల్సిన అవసరం ఉంది. పిచ్‌లపై ఎక్కువ దృష్టి పెట్టకుండా మంచి వికెట్లపై ఆడే విధానాన్ని అవలంబిస్తే ఫలితాలు మెరుగవుతాయి. ఓ కోచ్‌గా గంభీర్ కొత్తగా ఏం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు' అని గంగూలీ వెల్లడించాడు.


పాక్ చేతిలో ఓడితే.. మా అభిమానులు ఆత్మహత్య చేసుకుంటారు: అఫ్గాన్ క్రికెటర్

షెడ్యూల్ ప్రకారమే లీగ్.. ఆ వార్తల్లో నిజం లేదు: ఐపీఎల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy