Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒకటి కాదు.. రెండు రహస్య బేస్‌లు

ఒకటి కాదు.. రెండు రహస్య బేస్‌లు

  • ఇరాక్‌ ఎడారిలో ఇజ్రాయెల్‌ రెండు రహస్య మిలిటరీ స్థావరాల

బాగ్దాద్‌, మే 18: రహస్య మిలిటరీ, నిఘా ఆపరేషన్లలో ఆరితేరిన ఇజ్రాయెల్‌.. ఇరాక్‌లో ఆ దేశానికి ఏమాత్రం అనుమానం రాకుండా మిలిటరీ స్థావరాలను ఏర్పాటుచేసి, విజయవంతంగా నిర్వహించటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మొదటి ఒకటే స్థావరం ఏర్పాటుచేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. రెండు బేస్‌లను నెలకొల్పి నిర్వహించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇరాక్‌ నైరుతి ప్రాంతంలోని ఎడారిలో ఒక ఎండిపోయిన సరస్సులో ఇజ్రాయెల్‌ సైనికుల అనుమానాస్పద కదలికలను స్థానిక బడోయిన్‌ గొర్రెల కాపరి మార్చి 3వ తేదీన తొలిసారి గుర్తించాడు. హెలికాప్టర్లు చాలా తక్కువ ఎత్తులో ఎగరటం, ఎడారిలో టెంట్లు కనిపించటంతో అనుమానం వచ్చి ఇరాక్‌ మిలిటరీకి సమాచారం ఇచ్చాడు.

ఆ ప్రాంతానికి వెళ్లిన ఇరాక్‌ సైనికులపై ఇజ్రాయెల్‌ హెలికాప్టర్‌ కాల్పులు జరపటంతో ఒక సైనికుడు, ఒక పౌరుడు చనిపోయారు. అయితే, ఈ బేస్‌కంటే ముందే ఇరాక్‌ పశ్చిమ ప్రాంతంలోని ఎడారిలో ఇజ్రాయెల్‌ మరొక రహస్య మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేసిందని తాజాగా న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది. మొదట గుర్తించిన స్థావరాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టడానికి ముందు ఏర్పాటు చేయగా, తాజాగా గుర్తించిన స్థావరాన్ని 2024లోనే ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. 2025 జూన్‌లో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది.

12 రోజులపాటు రెండు దేశాల మధ్య భీకర దాడులు కొనసాగాయి. ఆ దాడుల కోసం తమ ఎయిర్‌ఫోర్స్‌కు సహకారం అందించేందుకు ఇజ్రాయెల్‌ ఈ రహస్య బేస్‌ను నెలకొల్పినట్లు తెలిసింది. ఇజ్రాయెల్‌ రహస్య మిలిటరీ స్థావరాలను ఇరాక్‌ సైన్యం గుర్తించలేకపోవటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది తమ మిలిటరీ వైఫల్యానికి నిదర్శనమని ఆ దేశ చట్టసభ ప్రతినిధి వాద్‌ అల్‌ కదు విమర్శించారు. తమ దేశ సార్వభౌమత్వానికి, ప్రజల గౌరవానికి ఘోర అవమానమని పేర్కొన్నారు. ఇరాక్‌ మిలిటరీ అధికారులకు ఇది సిగ్గుచేటు అని మండిపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy