Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒక్కొక్కరికి రెండు మూడు ఫాంహౌస్‌లు

ఒక్కొక్కరికి రెండు మూడు ఫాంహౌస్‌లు

  • కొన్నింటిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు

  • 200 ఏళ్లు పాలించిన నిజాం కంటే పదేళ్లు పాలించిన కేసీఆర్‌ ఆస్తులే అధికం

  • ఉద్యమం సమయంలో చెప్పుల్లేకుండా తిరిగామన్న వారికి ఇంత సంపద ఎలా వచ్చింది?

  • అవి నిజంగా వారి తాతల ఆస్తులైతే ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు వెల్లడించలేదు?

  • ప్రజలకు నిజాలు తెలియాలనే క్షేత్రస్థాయి పర్యటనలు: కాంగ్రెస్‌ నేతలు

  • అజీజ్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులకు చెందిన ఫాంహౌ్‌సల సందర్శన

రంగారెడ్డి అర్బన్‌/ మొయినాబాద్‌/ షాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ పార్టీలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన నిందితుడు పైలట్‌ రోహిత్‌రెడ్డితోపాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలకు ఒక్కొక్కరికి రెండు, మూడు ఫాంహౌస్‌లు ఉన్నాయని, వాటిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. నిజాం నవాబు ఆస్తుల కంటే మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబం ఆస్తులే అధికంగా ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయి భూముల పరిశీలనలో భాగంగా మూడోరోజు ఆదివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లో వారు పర్యటించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు హరీశ్‌రావు, రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లను సందర్శించారు. ఈ బృందంలో కాంగ్రెస్‌ ఎంపీలు చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, మల్లు రవి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, బలరాంనాయక్‌, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్‌, బీర్ల ఐలయ్య, బల్మూరి వెంకట్‌, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, నవీన్‌కుమార్‌యాదవ్‌, మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ సంస్థానాన్ని 200 ఏళ్ల పాటు పరిపాలించిన నిజాం ఆస్తుల కంటే తెలంగాణను పదేళ్లు పాలించిన కేసీఆర్‌ కుటుంబం ఆస్తులే ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నామని, బీఆర్‌ఎస్‌ నేతల భూములు ఆక్రమించేందుకు కాదన్నారు. ఉద్యమం సమయంలో చెప్పులు లేకుండా తిరిగామని ప్రగల్భాలు పలికిన హరీశ్‌రావు.. ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కేసీఆర్‌ మహానాయకుల పేర్లు చెప్పుకుంటూ, తాను సైతం అదే కోవకి చెందిన వాడిగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ తెలంగాణ జాతిపిత ఎలా అవుతాడని, తన హయాంలో రూ.8లక్షల కోట్ల అప్పులు చేసినందుకా? అక్రమంగా భూములు, ఆస్తులు సంపాదించినందుకా? అని ప్రశ్నించారు. తాతల కాలం నుంచి ఆస్తులున్నాయని చెబుతున్న కేసీఆర్‌ కుటుంబం.. వాటిని ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు చూపలేదన్నారు.

కేటీఆర్‌కు 2009లో లేని ఆస్తులు ఇప్పుడెలా వచ్చాయో చెప్పాన్నారు. హరీశ్‌రావుకు అజీజ్‌నగర్‌లో ఉన్న ఫామ్‌హౌస్‌ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందని, నిబంధనలకు విరుద్ధంగా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఫామ్‌హౌస్‌ పక్కన ఉన్న 300 ఎకరాల దళితుల భూములను కబ్జా చేయాలని చూశారని ఆరోపించారు. 24 జిల్లాల్లోని 36 గ్రామాల్లో సుమారు 400 ఎకరాల భూమిని ఎలా సంపాదించారో, రూ.కోట్లు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ధరణిని అడ్డుపెట్టుకొని భూములు కొల్లగొట్టింది మీరు కాదా?అని ప్రశ్నించారు. లక్షల ఎకరాలను 22ఏలో పెట్టిన మీరు ఇప్పుడు దొంగ కన్నీళ్లు కారుస్తున్నారన్నారని విమర్శించారు. తెలంగాణ అమరులు, ఉద్యమకారుల కుటుంబాలకు ఈ అక్రమ భూములను పంచాలని సీఎంను కోరుతున్నట్లు చెప్పారు.

అసైన్డ్‌ భూమిలో ఫాంహౌస్‌

బీఆర్‌ఎస్‌ నేత పైలట్‌ రోహిత్‌రెడ్డి అజీజ్‌నగర్‌లో సర్వే నెంబర్‌ 177లో పేదల కోసం కేటాయించిన 2.20 ఎకరాల అసైన్డ్‌ భూమి కొనుగోలు చేసి, అందులో ఫాంహౌస్‌ నిర్మించారని కాంగ్రెస్‌ బృందం పేర్కొంది. ఫాంహౌ్‌సను డ్రగ్స్‌ పార్టీలకు అడ్డాగా మార్చారని.. డ్రగ్స్‌ను సరఫరా కూడా చేస్తున్నారేమో అన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. రోహిత్‌రెడ్డి ఫాంహౌ్‌సలోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జరిగిందని గుర్తు చేశారు. 111 జీఓ పరిధిలో రోహిత్‌రెడ్డి అక్రమ నిర్మాణాలు చేస్తుంటే.. గత ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ఉపేక్షించిందని ప్రశ్నించారు.

కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఆరోపిస్తున్నట్లు తాము ప్రైవేట్‌ భూముల్లోకి వెళ్లడం లేదని, ప్రజలకు నిజాలు తెలిపేందుకే ఈ పర్యటనలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు, షాబాద్‌ మండలంలోని మద్దూర్‌లో ఉన్న మాజీ మంత్రి జగదీ్‌షరెడ్డి ఫాంహౌ్‌సను సందర్శించడానికి కాంగ్రెస్‌ నేతల బృందం రానుందని, వారిని బీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకోనున్నాయన్న సమాచారంతో పోలీసులను భారీగా మోహరించారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఫాంహౌస్‌ వద్ద పహారా కొనసాగించారు. అయితే, కాంగ్రెస్‌ బృందం మద్దూర్‌కు రావడం లేదని తెలిసి పోలీసులు ఊపీరి పీల్చుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy