Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓపెన్‌ఏఐ సంచలన నిర్ణయం.. మోడళ్ల శిక్షణకు బ్రేక్.!

ఓపెన్‌ఏఐ సంచలన నిర్ణయం.. మోడళ్ల శిక్షణకు బ్రేక్.!

ఇంటర్నెట్ డెస్క్: ఓపెన్ఏఐ సంచలన నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఓపెన్‌ఏఐ తన తాజా ఏఐ మోడళ్ల శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసింది.

అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్లలో సమాచారం సేకరించే సమయంలో తమ ఏఐ ఏజెంట్లు ఊహించని విధంగా వ్యవహరించిన ఘటనలపై సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఇటీవల ఫెడరల్‌ ప్రభుత్వానికి చెందిన పలు వెబ్‌సైట్లను పరిశీలించిన ఓపెన్‌ఏఐ ఏజెంట్లు.. తమకు ఇచ్చిన ఆదేశాలను కాకుండా.. ఊహించని రీతిలో కొన్ని చర్యలకు పాల్పడినట్లు సంస్థ గుర్తించింది. ఈ ఘటనల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారమే సేకరించినప్పటికీ, ఏజెంట్ల స్వతంత్ర ప్రవర్తనపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికా విద్యాశాఖ వెబ్‌సైట్‌కు సంబంధించిన ఓ ఘటనలో ఏఐ ఏజెంట్లు ప్రభుత్వ డేటాను యాక్సెస్‌ చేసేందుకు ఉపయోగించే 'ఏపీఐ డెవలపర్‌ కీస్‌'ను గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే.. చివరకు బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్నే సేకరించిందని అధికారులు తెలిపారు. వెబ్‌సైట్‌ లేదా డేటాబేస్‌పై ప్రభావం చూపే ఆధారాలేవీ లేవని విద్యాశాఖ స్పష్టం చేసింది.

మరో ఘటనలో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌(ఎస్‌ఈసీ)కు చెందిన బహిరంగ సమాచారాన్ని ఏఐ ఏజెంట్లు మరో వెబ్‌సైట్‌లో ప్రచురించారు. ఆ సమాచారాన్ని సేకరించడమే తమకు ఇచ్చిన పని కాగా, దాన్ని ఇతరచోట్ల ఉంచడం మాత్రం ఆదేశాలకు మించిన చర్యగా ఓపెన్‌ఏఐ భావించింది. ఎస్‌ఈసీ కూడా ఎలాంటి రహస్య సమాచారం యాక్సెస్‌ కాలేదని స్పష్టం చేసింది. దీంతో మరిన్ని భద్రతా చర్యలు అమలు చేసే వరకు మోడళ్ల శిక్షణను కొనసాగించబోమని ఓపెన్‌ఏఐ ప్రకటించింది. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న కొద్దీ ఇలాంటి సమస్యలు మళ్లీ ఎదురయ్యే అవకాశం ఉందని, అవసరమైతే భవిష్యత్తులోనూ ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి రావచ్చని సంస్థ తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy