Wednesday, 27 Jan, 7.21 pm ఆంధ్రజ్యోతి

జాతీయం-అంతర్జాతీయం
ఓటమి అంచుల్లో కరోనా వైరస్‌ : కేంద్ర మంత్రి హర్షవర్ధన్

న్యూఢిల్లీ : ప్రపంచం కరోనా వైరస్‌ను ఓడించబోతోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. ఈ మహమ్మారి ఓటమి అత్యంత సమీపంలో ఉందన్నారు. 2020వ సంవత్సరాన్ని కరోనా వైరస్ వ్యాక్సిన్ల అభివృద్ధి సంవత్సరంగా అభివర్ణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కార్యనిర్వాహక మండలి 148వ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.

బుధవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, వివిధ దేశాల్లో సాంక్రమిక వ్యాధుల అధ్యయనానికి సంబంధించిన ధోరణుల్లో చాలా తేడాలు ఉన్నప్పటికీ, మనం ముందస్తు నిరోధక, నియంత్రణ, సహకార వ్యూహంతో ఈ మహమ్మారిని ఓడించబోతున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మహమ్మారి ఓటమి అంచుల్లో ఉందన్నారు. 2020వ సంవత్సరం కోవిడ్-19 వ్యాక్సిన్ల అభివృద్ధి సంవత్సరం అయితే, 2021వ సంవత్సరం ఈ వ్యాక్సిన్లను ప్రపంచంలో అవసరం ఉన్నవారందరికీ చేర్చే సవాలుతో కూడిన సంవత్సరం అవుతుందన్నారు. డబ్ల్యూహెచ్ఓ ఈ సమయంలోనే అత్యంత విశిష్టమైన పాత్రను పోషించవలసి ఉందని చెప్పారు.

2020వ సంవత్సరంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా మనల్ని కమ్ముకున్న చీకట్లలో అత్యుత్తమ మానవత్వం ప్రకాశించిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి శాస్త్రవేత్తలు తమ అనుభవాలను పంచుకునేందుకు వీలుగా పెద్ద ఎత్తున అంతర్జాతీయ సహకారాన్ని పటిష్టం చేసుకోవలసిన అవసరాన్ని నొక్కి వక్కాణించిందన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top