Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాకిస్థాన్ జెర్సీలో సచిన్ టెండూల్కర్.. ఆ ఆసక్తికర ఘటన గురించి తెలుసా?

పాకిస్థాన్ జెర్సీలో సచిన్ టెండూల్కర్.. ఆ ఆసక్తికర ఘటన గురించి తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన సంగతి తెలిసిందే. అయితే భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి రెండేళ్ల ముందే అతడు పాకిస్థాన్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగిన విషయం చాలా మందికి తెలియదు.

1987లో పాకిస్థాన్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఆ సమయంలో ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన 40 ఓవర్ల ప్రదర్శన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

అప్పుడు సచిన్ వయసు కేవలం 13 ఏళ్లు. భోజన విరామం తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లు జావేద్ మియాందాద్, అబ్దుల్ ఖాదిర్ మైదానాన్ని వీడటంతో ప్రత్యామ్నాయ ఫీల్డర్ల అవసరం ఏర్పడింది. అప్పటి పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులను స్థానిక యువ ఆటగాళ్లను పంపించాలని కోరాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న సచిన్ వెంటనే పాకిస్థాన్ జెర్సీ ధరించి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా బరిలోకి దిగాడు.

ఆ మ్యాచ్‌లో అప్పటి భారత కెప్టెన్ కపిల్ దేవ్ కొట్టిన బంతిని సచిన్ ఔట్‌ ఫీల్డ్‌లో అందుకోవడం విశేషం. ఈ సంఘటనను సచిన్ తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో కూడా ప్రస్తావించాడు. 'నేను ఒకప్పుడు పాకిస్థాన్ జట్టుకు ఫీల్డింగ్ చేశానని ఇమ్రాన్ ఖాన్‌కు గుర్తుందో లేదో నాకు తెలియదు' అని అందులో పేర్కొన్నాడు. సచిన్ చిన్ననాటి స్నేహితుడు మార్కస్ కౌటో తాజాగా ఈ విషయంపై స్పందించాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేయాల్సి రావడంతో సచిన్ కొంత నిరాశకు గురయ్యాడట. పెద్ద షాట్లు క్యాచ్‌లుగా వచ్చే అవకాశం ఉందా అని అడగగా, అవి నేరుగా స్టాండ్స్‌లోకే వెళ్తున్నాయని తాను చెప్పినట్లు కౌటో గుర్తు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత రెండేళ్లకే సచిన్ భారత జట్టులోకి అరంగేట్రం చేసి, ఇదే ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి దిగ్గజ బౌలర్లను భారత జెర్సీలో ఎదుర్కొని ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు.

strong>

నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్‌వీర్ సింగ్

టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy