Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాకిస్థాన్ కొత్త నాటకం.!  'రెడ్ బుక్'లో జైషే చీఫ్ మసూద్ అజార్

పాకిస్థాన్ కొత్త నాటకం.! 'రెడ్ బుక్'లో జైషే చీఫ్ మసూద్ అజార్

ఢిల్లీ / ఇస్లామాబాద్, సెప్టెంబర్ 14: అక్టోబర్‌లో జరగనున్న 'ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్' (FATF) సమావేశంలో మళ్లీ గ్రే లిస్ట్‌లో పడకుండా తప్పించుకోవడానికి పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ సమాజాన్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తోంది.

ఇందులో భాగంగా పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (FIA) విడుదల చేసిన 2026 'రెడ్ బుక్' (అత్యంత కావలసిన ఉగ్రవాదుల జాబితా)లో జైషే మహమ్మద్ (JeM) అధినేత మసూద్ అజార్ పేరును చేర్చడంతో పాటు, ఆయన తలపై ఉన్న బహుమతిని PKR 50 లక్షల నుంచి PKR 70 లక్షలకు పెంచింది.

పాక్ వాదనను తిప్పికొట్టిన భారత నిఘా వర్గాలు

మసూద్ అజార్ 2021లోనే పాకిస్థాన్‌ను విడిచిపెట్టి ఆఫ్ఘనిస్థాన్‌కు పారిపోయాడని పాక్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలను భారత నిఘా వర్గాలు పూర్తి అవాస్తవాలుగా కొట్టిపారేశాయి. సాంకేతిక విశ్లేషణ ఆధారంగా మసూద్ అజార్ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్, నవాబ్‌షా నగరంలోనే సురక్షితంగా దాక్కున్నట్లు భారత నిఘా సంస్థలు ప్రాథమికంగా గుర్తించాయి.

26/11 నిందితుల జాబితాలో వివరాల ఉపసంహరణ

ఎఫ్‌ఐఏ విడుదల చేసిన జాబితాలో 26/11 ముంబై దాడులతో సంబంధం ఉన్న 19 మంది ఉగ్రవాదుల పేర్లు ఉన్నప్పటికీ, దౌత్యపరమైన వ్యూహంలో భాగంగా ఇద్దరు కీలక తీవ్రవాదుల ఫోటోలు, లష్కరే తొయిబా (LeT) అనుబంధ సంస్థలు , వారి పాత్రల వివరాలను తొలగించి కేవలం పేర్లను మాత్రమే ప్రచురించింది. 2021 జాబితాలో ముంబై దాడికి ఉపయోగించిన 'అల్-హుస్సేని' పడవను అందించిన ముహమ్మద్ ఖాన్, అబ్దుల్ రెహ్మాన్‌ల పూర్తి వివరాలు ఉన్నప్పటికీ, ఈసారి వాటిని కావాలనే మాయం చేయడం పాక్ కపట వైఖరికి నిదర్శనం.

గడిచిన ఐదేళ్లలో పాకిస్థాన్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల సంఖ్య 1,330 నుంచి 1,804కి (35% పెరుగుదల) పెరిగినప్పటికీ, వారిపై చర్యలు తీసుకోకుండా కేవలం కాగితాలపై మాత్రమే 'మోస్ట్ వాంటెడ్'గా చూపుతూ అంతర్జాతీయ ఒత్తిడి నుంచి తప్పించుకోవడమే పాక్ ప్రధాన ఉద్దేశమని నిపుణులు పేర్కొంటున్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy