Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలి: ఎంపీ మల్లు రవి

పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలి: ఎంపీ మల్లు రవి

హైదరాబాద్, మే 24: పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలని పాలకుర్తి నియోజకవర్గంలోని నేతలతోపాటు కేడర్‌కు ఎంపీ, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పిలుపునిచ్చారు.

నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్థానిక నేతలతో ఆదివారం హైదరాబాద్‌లో మల్లు రవి సమావేశమయ్యారు. అనంతరం గాంధీ భవన్‌లో ఎంపీ మల్లు రవి విలేకర్లతో మాట్లాడుతూ.. క్రమశిక్షణ కమిటీ ఎదుట పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఝాన్సీ రెడ్డి హాజరయ్యారన్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విదేశాల్లో ఉండడం వల్ల ఆమె రాలేదన్నారు.

ఎమ్మెల్యే యశస్విని విదేశాల నుంచి వచ్చిన తర్వాత మరోసారి రావాలని ఝాన్సీరెడ్డికి సూచించామని చెప్పారు. దీంతో మే 30వ తేదీన కమిటీ ముందు వారు హాజరవుతారని పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ స్థానిక నేతలు హరిప్రసాద్, కృష్ణ కిషోర్‌పై ఝాన్సీరెడ్డి, యశ్వస్విని రెడ్డిలు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీరెడ్డి కూడా పార్టీ క్యాడర్‌ను పట్టించుకోకపోవడంతోపాటు వారిని వేధిస్తున్నారంటూ తమకు ఫిర్యాదులు అందాయన్నారు.

ఈ నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గంలోని ఇరు వర్గాలను పిలిచి కమిటీ మాట్లాడుతుందని ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. ఇప్పటికే కిషోర్, హరిప్రసాద్‌కి షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. అందుకు వారు రికార్డు ఎవిడెన్స్‌తో సమాధానం ఇచ్చారని తెలిపారు. ఝాన్సీరెడ్డి కూడా తన వద్దనున్న సమాచారాన్ని తమకు అందజేశారన్నారు. ఈ అంశంపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు జిల్లాకు చెందిన నేతలందరితో కూర్చుని మాట్లాడతామని చెప్పారు. తద్వారా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీ స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy