Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాశ్చాత్య వెలుగులే మనకు చీకట్లు!

పాశ్చాత్య వెలుగులే మనకు చీకట్లు!

నం వాస్తవంగా ఒక అలసిన శతాబ్దంలో జీవిస్తున్నాం. ఈ ధరిత్రిపై భారత భూమికి సుదూర దేశాలలో గతించిన యుగాలలో నిర్మాణమైన మేధోసౌధం శిథిలాలలో నివసిస్తున్నాం.

ఆ మేధోసౌధం మనదే అని విశ్వసిస్తున్నాం. అదొక తప్పుడు విశ్వాసం, భ్రమ. దానినుంచి బయటపడలేనితనం మనలను కుంగదీస్తోంది. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట మానవ తప్పిదం కారణంగా ఏదో ఒక దుర్ఘటన సంభవిస్తోంది. నేపాల్‌ వరద బీభత్సం, గాజాలో జాతి సంహారం, డోనాల్డ్ ట్రంప్‌ అరాచకత్వం ప్రపంచాన్ని బాధిస్తున్నాయి, వేధిస్తున్నాయి. మన జీవనోన్నతికి ఏ భావాలయితే తోడ్పడాలో అవే మనకు వ్యతిరిక్తమయ్యాయి.

'భవిష్యత్తుపై గతం తన వెలుగులు ప్రసరింపజేయడం మానేసినందున మనిషి మనసు అంధకారంలో సంచరిస్తోంది' అని రెండు శతాబ్దాల క్రితం అలెక్సిస్‌ డి టోక్‌విల్లే అనే ఫ్రెంచ్‌ మేధావి వ్యాఖ్యానించాడు. ఇప్పుడు మనమూ అటువంటి సంకటస్థితిలోనే ఉన్నాం. ఒక సంధికాలంలో కొట్టుమిట్టాడుతున్నాం. గతించిన కాలపు భావాలతో భవిష్యత్తులోకి వెళ్లడానికి ప్రయత్నించడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. యూరోప్‌ ఘనమైన గతం కానీ, అమెరికా ప్రశస్త వర్తమానం కానీ మన భవిష్యత్తుకు మార్గదర్శకాలు కాలేవు. పాశ్చాత్య ఆధునికత మాసిపోయింది. కొత్తదనాన్ని కోల్పోయింది. దుర్గంధాన్ని వెదజల్లుతోంది. అయినా మనం రోజూ దానికి మెరుగులు దిద్ది మన పిల్లలకు నేర్పుతున్నాం.

ప్రజాస్వామ్యాన్నే తీసుకోండి. అదొక సమ్మోహన సమున్నత ఆదర్శం. గత శతాబ్దంలో అది ఒక విప్లవాత్మక భావం. ఇప్పుడు ప్రపంచానికి ప్రామాణిక ఆదర్శం. దానినే మనం ఉదారవాద ప్రజాస్వామ్యం అని పిలుస్తున్నాం. ప్రజా సార్వభౌమత్వం అనే మరో సమున్నత భావాన్ని పోటీదాయక ఎన్నికల ద్వారా అధిక సంఖ్యాకుల పాలన ప్రాతిపదికన ప్రాతినిధ్య ప్రభుత్వంగా మార్చివేశాం. అయితే మనం ప్రజాస్వామ్యంగా భావిస్తున్న పాలనా పద్ధతులు కొద్దిమందికి మాత్రమే స్వపరిపాలనను సమకూర్చాయి. ఆధునిక ప్రజాస్వామ్యం నిజానికి ప్రజలు సాధికారత కోల్పోయేలా చేసింది. రాజ్య వ్యవస్థను సర్వశక్తిమంతం చేసింది. నాయకత్వాలు జవాబుదారీతనం లేకుండా వ్యవహరించేందుకు తోడ్పడింది. మీడియా పూర్తిగా కార్పొరేట్‌ నియంత్రిత రంగం కావడానికి దోహదం చేసింది. ధనశక్తికి అపార ప్రాధాన్యమిచ్చింది. ఇవన్నీ ప్రజలను నిస్సహాయులను చేశాయి. ప్రజా సార్వభౌమత్వం బోలుమాటగా మిగిలిపోయింది. ప్రజాకర్షక రాజకీయాలు, మెజారిటీవాదం ఎన్నికైన నిరంకుశ ప్రభుత్వాలు.. ఆధునిక ప్రజాస్వామ్య రుగ్మతలు కావు, అవి మనం ప్రజాస్వామ్యంగా అంగీకరించి, అమలు జరుపుకుంటున్న యంత్రాంగం సహజ పరిణామాలు.

మన మరో గొప్ప ఆదర్శం జాతిరాజ్యం. ఏదో ఒక దానికి 'చెందిన' భావన, సొంతవారని భావించేవారితో సాంగత్యం, అనుబంధం పెంపొందించుకోవడం ప్రతి వ్యక్తికీ ఒక మానసిక అవసరం. ఆధునిక యుగంలో ప్రపంచాన్ని 'జాతులు' అనే రాజకీయ సమాజాలుగా విభజించి సుస్థిరపరచడం ద్వారా ఈ స్వతస్సిద్ధ మానవ అవసరాన్ని తీర్చారు. ఈ రాజకీయ సమాజాలే జాతి రాజ్యాలు. నిశితంగా పరిశీలిస్తే జాతులు అనేవి ఊహాజనిత సమాజాలు. ఇవి అధికార కేంద్రాలుగా పనిచేస్తూ తమ పరిధిలోని ప్రతి ఒక్కరి నుంచి తిరుగులేని విధేయతను కోరతాయి. ఇక్కడే, జాతి రాజ్యాలతో సమస్యలు తలెత్తుతున్నాయి. జాతి రాజ్యాల చరిత్రను చూస్తే అవి మనుషులను కలిపి ఉంచలేదు సరికదా వేరు చేశాయి. 'మనం', 'వారు' అనే భావనను నెలకొల్పి వైషమ్యాలు రెచ్చగొట్టాయి. ఈ రాజకీయ సమాజాల ప్రభావంతో ఇరుగుపొరుగువారినీ ద్వేషించడం జరుగుతోంది. ఇరవయో శతాబ్ది యుద్ధాలే ఇందుకు నిదర్శనం. ఈ సంకుచిత జాతీయవాదం జాత్యహంకారంగాను, యుద్ధోన్మాదంగానూ వెర్రితలలు వేసింది, వేస్తోంది.

కూడు, గూడు, గుడ్డ మానవుని సహజ అవసరాలు. ఇవి అంత తేలిగ్గా తీరవు. తీరినా ఇంకా ఎన్నో కోరికలు ఉంటాయి. భౌతిక శ్రేయస్సును పరిపూర్ణంగా సమకూర్చుకోవాలని సదా స్వప్నిస్తాడు. ఆ స్వప్నసాధననే ఇరవయో శతాబ్దిలో 'అభివృద్ధి' అని చెప్పుకున్నారు. భౌతిక శ్రేయస్సును సమకూర్చుకోవడాన్ని మనం ఇప్పటికీ 'అభివృద్ధి'గా భావిస్తున్నాం. ఆ 'అభివృద్ధి' సాధనను ఒక ఉత్కృష్ట విషయంగా ఔదలదాలుస్తున్నాం. పారిశ్రామికీకరణ, పట్టణీకరణలతో అటువంటి అభివృద్ధిని సాధించాం.. ప్రైవేట్‌ ఆస్తి, స్వేచ్ఛా విపణి, అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రాధాన్యమిచ్చే పెట్టుబడిదారీ ఆర్థిక విధానం ఆ అభివృద్ధికి ప్రధాన చోదకశక్తి. అయితే ఆ అభివృద్ధి స్వప్నాలు వికటిస్తున్నాయి. సిరిసంపదలు కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. సిరులు సృష్టించే శ్రమ జీవులకు ఏమీ దక్కడం లేదు. జీవన ప్రమాణాలు ఇతోధికంగా మెరుగుపడినప్పటికీ మనిషి ఆకాంక్షలూ పెరిగిపోయాయి. ఫలితంగా సహజవనరులు తరిగిపోతున్నాయి. మన ధరిత్రి మానవుని అవసరాలను తీర్చగలదేగానీ అతడి అపరిమిత భోగలాలసను సంతృప్తిపరచలేదు. ఈ కారణంగానే పలు సంక్షోభాలు, ముఖ్యంగా పర్యావరణ విధ్వంసం సంభవిస్తోంది. దీనిని నిలిపివేయకపోతే ప్రకృతికి, మానవేతర జీవకోటికి, భావి తరాలకు తీరని నష్టం వాటిల్లడం ఖాయం. విధ్వంసక అభివృద్ధి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అనేవి మనం అనుసరిస్తున్న ఆర్థికాభివృద్ధి నమూనా లోపాలు కాదు, అవి దాని సహజ లక్షణాలు.

అజ్ఞానం, అసత్యాల నుంచి స్వేచ్ఛ సాధించడమే మన నాలుగో అన్వేషణ. ఆధునిక వైజ్ఞానిక పద్ధతి ఇందుకు తోడ్పడుతోంది. సమస్త జ్ఞాన రంగాలు అనుసరించాల్సిన నిర్దిష్ట నియమావళిని అది రూపొందించింది. ఏది సత్యం, ఏదసత్యం అనేదాన్ని నిర్ధారించింది. దీని ప్రకారం ఏది జ్ఞానం? సర్వత్రా ఒకే విధమైన ఫలితాలను ఇచ్చేది, క్రమబద్ధమైన ధ్రువీకరణకు సాధ్యమయ్యేదే ప్రామాణిక జ్ఞానం. సాంకేతిక విజయాలు ఆ జ్ఞానానికి అంతిమ రుజువు. ఈ పద్ధతి మానవ సమస్యలను పరిష్కరించడంలో సఫలమవుతున్నందున విజ్ఞానశాస్త్రం మన కాలపు కొత్త మతంగా పరిగణన పొందింది. అయితే అది మానవ మేధను సంకుచితపరిచింది. నైతిక ప్రాతిపదికలు కోల్పోయేలా చేసింది. పాశ్చాత్య మేధో ఆధిపత్యాన్ని నెలకొల్పింది.

ప్రతి మనిషీ సంతోషమయ జీవితాన్ని కోరుకుంటాడు, మానసిక సాంత్వనలకూ ఆరాటపడతాడు. భౌతిక సౌఖ్యం, మానసిక ప్రశాంతికి మానవుని అన్వేషణను మనం విధిగా పట్టించుకోవాలి. పాశ్చాత్య ఆధునికతతో అంకురించి ప్రపంచవ్యాప్తమైన 'లౌకికవాదం' అన్ని మతాల స్వభావాన్ని మార్చివేసింది. సమస్త సమాజాలూ లౌకికవాద భావజాలాన్ని ఆచరణలో కాకపోయినా సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాయి. మతం క్షీణించకపోగా నిర్దిష్ట మతపరమైన అనుయాయులను మరింత మతనిష్ఠతో వర్గీకరించడం జరుగుతోంది. విభిన్న మత వర్గాల మధ్య పోటీ పెచ్చరిల్లుతోంది. దీనివల్ల మత పరమార్థం ఉపేక్షితమవుతోంది. ప్రతి మతంలోను వ్యాపార, ఛాందసవాద ధోరణులు పెరుగుతున్నాయి. ఆధునిక మానవుడు గత తరాల కంటే సుఖసంతోషాలతో బతుకుతున్నాడని, అతడి జ్ఞానసంచయం మున్నెన్నడూ లేని రీతిలో అపారమైనదని మీరు అనవచ్చు. కానీ, మన తాత ముత్తాతల కంటే మనం సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నామని మీరు చెప్పగలరా?

'భూత' అనే పదానికి మరో అర్థం కూడా ఉన్నది. అది భౌతిక జగత్తులోని ప్రాథమిక పదార్థాలను సూచిస్తుంది. హిందూ మత గ్రంథాల ప్రకారం ఆ ప్రాథమిక పదార్థాలు ఐదు. అవి: భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. ఆధునిక మానవుని స్వతస్సిద్ధ స్వభావంలోనూ అటువంటి అయిదు ప్రాథమిక అంశాలను మనం గుర్తించాలని 21వ శతాబ్దం ఆహ్వానిస్తోంది. ఆ స్వాభావిక మానవ అవసరాలు: స్వయం ప్రతిపత్తి, అనుబంధం, శ్రేయస్సు, సత్యం, ఆనందం. గత శతాబ్దపు రాజకీయ, సామాజిక, ఆర్థిక నిర్మాణాలు ఈ అవసరాలను తీర్చడంలో విఫలమయినందున మనం కొత్త వ్యవస్థలను నిర్మించుకోవాలి. ఇందుకు మనం పాత ఆధిపత్య చింతనా ధోరణులకు భిన్నంగా ఆలోచించవలసి ఉంది. ఇప్పటివరకు మనలను ప్రభావితం చేస్తున్న పాశ్చాత్య ఆధునికత ప్రభావశీలత కృశించిపోతోంది. దాని వెలుగులు క్షీణించిపోతున్నాయి. పాశ్చాత్యేతర సమాజాలలో సమున్నత జ్ఞాన సంప్రదాయాలు ఉన్నాయని, అవి మన జీవితాలను అర్థవంతం, ఆనందప్రదం చేసేందుకు యోగ్యమైన ప్రత్యామ్నాయ ఆలోచనా స్రవంతులను సమకూరుస్తాయనే సత్యాన్ని గుర్తించాలి. పాశ్చాత్య ఆధునికతకు భిన్నమైన భావ సాహసాలు చేయగలిగితే 21వ శతాబ్దాన్ని భూతకాలంగా (దాని అత్యుత్తమ అర్థంలో) మార్చుకోగలమనడంలో సందేహం లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy