అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పన్నుల శాఖ సంస్కరణలను జీఎస్టీ(GST) కౌన్సిల్ సెక్రటేరియట్ అధికారులు ప్రశంసించారు.
దేశానికే ఆదర్శంగా ఏపీ ఏఐ ఆధారిత పన్నుల పరిపాలన ఉందని వ్యాఖ్యానించారు. ఏఐ ఆధారిత పన్నుల పరిపాలన దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన నమూనా అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో (AP CM Chandrababu Naidu) జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ సీనియర్ అధికారులు ఈరోజు (బుధవారం) సమావేశమయ్యారు. ఏపీసీటీడీలో (APCTD) ఏఐ ఆధారిత రిటర్నుల పరిశీలన, ఆడిట్, తనిఖీలను అధికారులు పరిశీలించారు. ఏఐ ఆధారిత న్యాయ కేసుల నిర్వహణ, దర్యాప్తు విధానాలను పరిశీలించారు.
ఏఐ డ్యాష్‌బోర్డులు, జీఎస్టీ డేటాతో రియల్‌టైమ్ జీఎస్‌డీపీ (GSDP) విశ్లేషణపై అధికారులు అధ్యయనం చేశారు. జీఎస్టీ సువిధ కేంద్రాన్ని సందర్శించి పన్ను చెల్లింపుదారులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఏఐ ఆధారిత సాంకేతిక ఆవిష్కరణల్లో ఏపీ వాణిజ్య పన్నుల శాఖ పనితీరుపై అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్రప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు అనుసరించిన నమూనాగా ఏపీ ఏఐ ఆధారిత పన్నుల పరిపాలన ఉందని కొనియాడారు. ఏఐతో పన్నుల ప్రక్రియలు వేగవంతం అవుతాయని వెల్లడించారు.
వ్యాపార నిర్వహణ మరింత సులభతరం అవుంతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆదాయం పెంపుతో పాటు దేశ ఆదాయాల పెరుగుదలకు ఏఐ ఆధారిత పన్నుల పరిపాలన దోహదం చేస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఏఐ పన్నుల పరిపాలన విస్తరణకు జీఎస్‌టీఎన్(GSTN) డేటా, సిస్టమ్ ఇంటిగ్రేషన్‌పై కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్రంతో డేటా పంచుకునే విధానంలో కేంద్రప్రభుత్వం సహకరించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
వార్తలు కూడా చదవండి...

