Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పట్టభద్రుల పోరుకు కసరత్తు!

పట్టభద్రుల పోరుకు కసరత్తు!

  • ఓటరు నమోదుకు షెడ్యూల్‌ విడుదల

  • 28వ తేదీ నుంచి ఫారం-18 దరఖాస్తుల స్వీకరణ

  • పాత ఓటర్లు కూడా కొత్తగా నమోదు చేసుకోవాల్సిందే..

  • ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్‌గా ఎన్నిక

  • గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదుకు పోటాపోటీగా సన్నాహాలు

  • ఈసారి ఓటర్ల సంఖ్య 7 లక్షలు దాటే అవకాశం

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు కసరత్తు మొదలైంది. 2027 మార్చిలో పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి నవంబర్‌ 6 వరకు ఫారం -18 దరఖాస్తులను అధికారులు స్వీకరించనున్నారు. అయితే పాత ఓటర్లు కూడా కొత్తగా నమోదు చేసుకోవాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్ల నమోదుపై దృష్టి సారించాయి. గతంలో 5.3 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఈ సారి ఆ సంఖ్య 7 లక్షల నుంచి 8లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు కసరత్తు మొదలైంది. రాష్ట్రంలో 2027 మార్చిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీకానున్న విషయం తెలిసిందే. ఇందులో హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కూడా ఉంది. గడువులోగా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది.

ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రక్రియ ప్రారంభించేందుకు షెడ్యూల్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ఓట్ల నమోదు కోసం ఈనెల 28న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. సెప్టెంబర్‌ 28 నుంచి నవంబర్‌ 6 వరకు ఫారం -18 దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్‌ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 10 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబర్‌ 30వ తేదీన పట్టభద్రుల తుది జాబితా ప్రకటిస్తారు. ఇప్పటికే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదైన పాత ఓటర్లు కూడా ఈసారి కొత్తగా ఫార-18 దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.

ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎన్నికల సంఘం నియమించిన అధికారుల వద్ద ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇదిలా ఉంటే హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్‌గా మారింది. దీంతో ఎన్నికలకు మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ప్రాంతంలో జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

 ఈ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకునేందుకు మూడు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల వేట మొదలు పెట్టాయి. అంగబలం, అర్ధబలం ఉన్న నేతల కోసం అన్వేషిస్తున్నాయి. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించారు. అయితే ఇపుడు అధికార కాంగ్రెస్‌ పార్టీ బలపడడంతో ఈ సారి త్రిముఖ పోటీ జరిగే అవకాశాలున్నాయి.

ఓటర్ల నమోదుపైనే పార్టీ దృష్టి

త్వరలో ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉండడంతో ఆయా రాజకీయ పార్టీలు ఓటర్ల నమోదుపై ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టిపెడుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సాధ్యమైనంత ఎక్కువ మంది ఓటర్లను నమోదు చేయించేందుకు పార్టీలు పోటీపడుతున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుస్తున్నాయి. నిరుద్యోగ యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్కొక్కటీ కనీసం 3లక్షల మంది ఓటర్లు నమోదుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ బాధ్యతలను ఆశావహులకు అప్పగిస్తున్నాయి. దీంతో వీరంతా ఇప్పటికే రంగంలో దిగారు.

ఎవరు అర్హులు?

నవంబర్‌ 1వ తేదీ నాటికి మూడేళ్ల డిగ్రీ పూర్తిచేసినవారంతా అర్హులే. దరఖాస్తుతో పాటు డిగ్రీ పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రాలు కూడా జతపరచాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అర్హత కలిగిన పట్టభద్రులు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అలాగే పోస్టు ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy