Dailyhunt

పత్తి అదనంగా 5.7లక్షల ఎకరాల్లోనే

వరి సాగు పెరిగేది 57 వేల ఎకరాలే

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌కు సంబంధించిన సాగు ప్రణాళికలో పత్తి, వరి, కంది పంటలకే అగ్రస్థానం దక్కింది. ప్రధాన పంటల తర్వాత అత్యధికంగా సోయా సాగు చేపట్టాలని నిర్ణయించారు. గత వానాకాలం 1.22కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. ఈ సారి 1.35 కోట్ల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక రూపొందించింది. అంటే సాగు విస్తీర్ణం 13 లక్షల ఎకరాలు మాత్రమే పెరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 60,16,079 ఎకరాల్లో పత్తి సాగు చేపట్టాలని ప్రణాళికలో పేర్కొన్నారు.

ఇది గత ఏడాది కన్నా 5.7లక్షల ఎకరాలే అదనం. వరి సాగుకు 41,76,778 ఎకరాలను ప్రతిపాదించారు. గత సీజన్‌లో 41,19,551 ఎకరాల్లో వరి సాగు చేయగా..

ఈ సారి కేవలం 57,227 ఎకరాల విస్తీర్ణాన్ని పెంచారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని నిర్ణయించిన అధికారులు.. వరి విస్తీర్ణాన్ని కేవలం 1,293 ఎకరాలకే పరిమితం చేశారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 7.10 లక్షల ఎకరాలు, ఆ తర్వాత నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో 4.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని పొందుపరిచారు.

12.31 లక్షల ఎకరాల్లో కంది సాగును నిర్దేశించినప్పటికీ.. సీఎం ఆదేశాల మేరకు 15 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని భావిస్తున్నట్లు వ్యవసాయ తెలిపింది. జొన్న, పెసర, మినప, ఆముదం, వేరుశనగ, చెరకు సాగు విస్తీర్ణం కూడా నామమాత్రంగానే పెంచారు. గత వానాకాలం సీజన్‌లో 30,481 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, నువ్వులు, రాగులు సాగు చేయగా.. ఈసారి 54,353 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో కూరగాయల సాగుకు 10,742 ఎకరాలను నిర్దేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy