Monday, 10 May, 2.36 am ఆంధ్రజ్యోతి

జాతీయం-అంతర్జాతీయం
పట్టు పట్టారు... ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు...

అసోం : అసోం తదుపరి ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వాస్ శర్మను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. విద్యార్థి రాజకీయాల నుంచి మొదలైన ఆయన ప్రస్థానం ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుంది. 1991-92 లో గౌమతి కాటన్ కాలేజీ సొసైటీకి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఏకంగా 2001 లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనకి అదే మొదటి విజయం. రావడం రావడమే మొదటి సారే అప్పటి సీఎం తరుణ్ గొగోయ్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టి, సంచలనం సృష్టించారు. తర్వాత 2006, 2011 లో జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి, అదే కేబినెట్‌లో మంత్రిగా కొనసాగారు. నాలుగు సార్లూ కేబినెట్ మంత్రిగానే కొనసాగారు. 2011 లో అసోంలో కాంగ్రెస్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ అద్భుత విజయం వెనక ఉన్నది హేమంత్ శర్మే.

అయితే 2014 నుంచే అసలు కథ ప్రారంభమైంది. అప్పటి సీఎం తరుణ్ గొగోయ్‌తో హిమంత్ బిశ్వాస్‌కు ఏమాత్రం పడిరాలేదు. 2014 జూలై 21 న అన్ని పదవులకూ రాజీనామా చేసి కాంగ్రెస్‌కు షాకిచ్చారు. అసలు విషయం ఏమిటంటే సీఎం తరుణ్ గొగోయ్‌ను హిమంత్ రాజకీయ గురువుగా భావిస్తారు. అంతలా శిష్యరికం చేసిన తనను కాదని, గొగోయ్ తన కుమారుడు గౌరవ్ గొగోయ్‌ని రాజకీయంగా ప్రోత్సహించడం శర్మకు నచ్చలేదు. కాంగ్రెస్‌ను వీడడానికి ఇదీ ఒక కారణమే అని చెబుతుంటారు. అయితే రాహుల్ గాంధీ వ్యవహారం నచ్చకే హిమంత కాంగ్రెస్‌ను వీడారన్నది బహిరంగ రహస్యమే.

సోనియా హామీ ఇచ్చినా.... రాహుల్ మోకాలడ్డారు....

క్షేత్ర స్థాయిలో పార్టీపై పూర్తి పట్టున్న నేతగా హేమంత్‌ను పేర్కొంటారు. పైగా కాస్త దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తిగా పేర్కొంటారు. 2014 లో అసోంలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడానికి హేమంత్‌లో పేరుకుపోయిన అసంతృప్తే అని అంటారు. మూడు సార్లు వరుసగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి, గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్థుడైన తరుణ్ గొగోయ్‌ను ధిక్కరించారని, అందుకే కాంగ్రెస్‌కు ఘోర పరాభవమని పేర్కొంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అసోం రాజకీయాలపై హేమంత్ ప్రభావం ఎంత గాఢంగా ఉందో. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయ్యింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అప్పటి సలహాదారు అహ్మద్ పటేల్ హేమంత్ వ్యవహారంపై కన్నేశారు. కాంగ్రెస్‌లోని చాలా మంది ఎమ్మెల్యేలు హేమంత్ వెనక ఉన్నారని కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలిసింది. అసోం వ్యవహారాల ఇన్‌చార్జి ఖర్గే ఈ విషయాన్ని అధిష్ఠానానికి తేల్చి చెప్పారు. దీంతో ఆయన్ను ఢిల్లీకి పిలిపించారు. సీఎం పదవి ఇస్తామని ఏకంగా అధినేత్రి సోనియా గాంధీయే హామీ ఇచ్చారు. అయితే రాహుల్ గాంధీ మోకాలడ్డారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీ అంటే ఒంటి కాలిపే లేస్తారు హేమంత్. రాహుల్‌ను విమర్శించే ఏ అవకాశాన్నీ ఆయన జారవిడుచుకోలేదు. అయితే 2016 లో హిమంత్ శర్మ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలతో మాట్లాడటం కంటే రాహుల్ గాంధీ తన పెంపుడు కుక్కలతో ఆడుకోవడానికే అధిక ప్రాధాన్యమిస్తారు.'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొద్ది కాలంలోనే బీజేపీలో తిరుగులేని నేతగా ఎదిగిన శర్మ

హేమంత్ శర్మలో నెలకొన్న అసంతృప్తిని మొట్ట మొదట గుర్తించింది అసోం బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సిద్ధార్థ భట్టాచార్య. ఈయన వల్లే ఆయన బీజేపీలో చేరారు. అనతి కాలంలోనే బీజేపీ రాజకీయాలను జీర్ణం చేసుకొని, క్షేత్ర స్థాయిలో బీజేపీని పటిష్ఠం చేశారు. అసోంలో బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు చాలా తక్కువగా ఉంటుంది. అయినా సరే... వారందరూ బీజేపీ వైపు వచ్చేలా హిమంత చేశారు. అయితే కాంగ్రెస్ చేసిన పొరపాటును బీజేపీ చేయలేదు. ఆయన రాజకీయ చాతుర్యాన్ని ముందే పసిగట్టిన అధిష్ఠానం ఆయనకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. అనతి కాలంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు దగ్గరయ్యారు. అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాలకు అత్యంత కీలకమైన నేతగా ఎదిగారు. చాలా మందిని బీజేపీ వైపు లాగారు. అయితే చాలా రోజుల క్రిందటే ఈయన సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని అసోం రాజకీయ నేతలు భావించారు. కానీ... బీజేపీలో చేరిన తర్వాత ఆయన సీఎం అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే... ఆయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ అధిష్ఠానం ఎన్నుకునేలా పరిస్థితులను సృష్టించుకున్నారు. ముఖ్యమంత్రి పీఠమెక్కి, వైరి వర్గానికి షాకిద్దామని అనుకున్నారు. అనుకున్నది సాధించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top