అమరావతి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల్లో సంబంధిత అధికారులు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జూ ప్రాంగణాలను మరింత పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడం, జంతువులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
జంతువుల ఆవాస ప్రాంతాలు, సందర్శకుల మార్గాలు, ఉద్యానవనాలు, నీటి వనరులు, విశ్రాంతి ప్రాంతాలు, ఆహార పంపిణీ కేంద్రాలు, వ్యర్థాల సేకరణ ప్రాంతాల్లో అధికారులు పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. జూ పరిసరాల్లో వ్యర్థాల వర్గీకరణ, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, పచ్చదనం సంరక్షణ, పారిశుధ్య ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు అధికారులు తెలిపారు.
ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్..
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో నమూనాలను సంబంధిత అధికారులు సేకరిస్తున్నారు. జల కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నీటి విడుదల వ్యవస్థల నుంచి నీటి నమూనాలను సేకరిస్తున్నారు. శాస్త్రీయంగా పరీక్షించి, కాలుష్య స్థాయిని అధికారులు అంచనా వేయనున్నారు.
కాలుష్యానికి కారణమవుతున్న అంశాలను గుర్తించి, సంబంధిత యాజమాన్యాలకు నివారణ చర్యలపై అధికారులు సూచనలు చేయనున్నారు. నేడు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, నెల్లూరు జిల్లాల పరిధిలోని ఆక్వా కేంద్రాల నుంచి నమూనాలను అధికారులు సేకరిస్తున్నారు. మంగళవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని ఆక్వా కేంద్రాల్లో నమూనాలను అధికారులు తీసుకోనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే..

