Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెళ్లికి నెల రోజుల ముందు దారుణం.. హత్య చేసి మురుగు కాలువలో పడేసి..

పెళ్లికి నెల రోజుల ముందు దారుణం.. హత్య చేసి మురుగు కాలువలో పడేసి..

న్యూఢిల్లీ: పెళ్లికి సరిగ్గా నెల రోజుల ముందు మాజీ సహోద్యోగిని చేతిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల కారణంగా తన ప్రియుడితో కలిసి సదరు మహిళ ఆ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది.

హత్య అనంతరం మృతదేహాన్ని మురుగు కాలువలో పడేసింది. మరోవైపు, బాధిత కుటుంబ సభ్యులకు తెలియకుండా పోలీసులే దహన సంస్కారాలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన ఢిల్లీ, గురుగ్రామ్‌లలో కలకలం రేపింది.

బాధిత యువకుడు యువరాజ్ సింగ్ మంచందాకు మరో నెల రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. ఈ మేరకు సెప్టెంబర్ 6న తన సోదరీమణులతో కలిసి ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ మార్కెట్‌లో షాపింగ్ చేశాడు. సంతోషంగా షెర్వాణీ వంటి పెళ్లి బట్టలను కొనుగోలు చేశాడు. అనంతరం గురుగ్రామ్‌లో మాజీ సహోద్యోగితో అత్యవసర సమావేశం ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రాత్రి 10 గంటల కల్లా ఇంటికి వస్తానని ఫోన్ చేసి చెప్పాడు. అతను ఇంటికి రాకపోగా.. ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. రోజుల తరబడి యువరాజ్ ఆచూకీ తెలియకపోవడంతో సెప్టెంబర్ 11న బాధిత కుటుంబం లజ్‌పత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడి మాజీ సహోద్యోగిని వాట్స్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా విచారణ చేపట్టగా ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో వాట్స్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వాట్స్‌ను, ఆమె భాగస్వామిని ఉత్తరాఖండ్‌లో గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ యువరాజ్‌ను హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. అనంతరం మృతదేహాన్ని మురుగు కాలువలో పడేసినట్లు తెలిపారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిజానిజాలు తేల్చేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు, యువకుడి మృతదేహానికి పోలీసులే దహన సంస్కారాలు చేయడం వివాదానికి దారి తీసింది. సెప్టెంబర్ 10న యువరాజ్ మృతదేహాన్ని గుర్తించిన గురుగ్రామ్ పోలీసులు.. సెప్టెంబర్ 14న అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, యువరాజ్ మృతిపై పోలీసులు తమకు సమాచారం ఇవ్వలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే అంత్యక్రియలు నిర్వహించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి యువరాజ్ ఒక్కడే కావడం, అతడిని చివరి చూపు చూసుకునేందుకూ అవకాశం లేకపోవడంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

మొదట ఓట్ చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ: రాహుల్ గాంధీ

ఆసియా క్రీడల్లో జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌, కోచ్‌ అశోక్‌ మిశ్రాకు షాకింగ్ అనుభవం..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy