Dailyhunt

పెరియార్‌ వివాదం: కేసులు ఎదుర్కొనేందుకు సిద్ధమంటున్న రజనీ ఫ్యాన్స్‌!

  • రాజకీయాల కోసమేనంటూ పుదుచ్చేరి సీఎం, వైగో కామెంట్లు
  • పబ్లిసిటీ కోసమే: మంత్రులు

చెన్నై : ద్రవిడ ఉద్యమనేత దివంగత పెరియార్‌ రామస్వామిపై తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో మాటల మంటలు కొనసాగుతున్నాయి.

పెరియార్‌ను కించపరచడాన్ని సహించబోమని, ఆయన కీర్తికి కళంకం ఆపాదించేలా వ్యవహరిస్తే అన్నాడీఎంకే గళం విప్పుతుందనే విషయాన్ని గుర్తించుకొని మాట్లాడాలని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. కొత్త పార్టీని ప్రారంభించేందుకు పథకం వేసిన రజనీకాంత్‌ రాజకీయాల్లో కాలుమోపేందుకు పెరియార్‌ గురించి వదంతులు పుట్టిస్తున్నారని ద్రావిడర్‌ కళగం అధ్యక్షుడు వీరమణి, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తదితరులు ధ్వజమెత్తారు. తాజాగా రాష్ట్ర మంత్రులు సెల్లూర్‌ రాజు, ఆర్బీ ఉదయకుమార్‌లు ఇదంతా పబ్లిసిటీ కోసమేనని, రాజకీయాల్లోకి వచ్చేందుకు రజనీ ఇలా పెరియార్‌ను విమర్శిస్తున్నారని అన్నారు. ఇదిలా ఉండగా, పెరియార్‌ గురించి వ్యాఖ్యానించిన తమ హీరో రజనీపై కేసులు పెడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉనట్టు సూపర్‌స్టార్‌ అభిమానులు ప్రకటించారు. మదురైలో గురువారం అన్నాడీఎంకే తరఫున స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రజా ప్రతినిధుల అభినందన సభ జరిగింది.

ఇందులో పాల్గొన్న మంత్రి సెల్లూర్‌ రాజు మాట్లాడుతూ, ఎప్పుడో జరిగిన ఘటన గురించి ఇప్పుడు మాట్లాడి వుండాల్సింది కాదని, పెరియార్‌ సంస్కరణలు తీసుకురాకపోతే రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య పునర్వివివాహం చేసుకొని ఉండేవారు కారని వ్యాఖ్యానించారు. ఆ తరువాత మాట్లాడిన మంత్రి ఉదయకుమార్‌, పెరియార్‌ జీవిత చరిత్ర గురించి తెలిస్తేనే ఆయన గురించి అభిప్రాయాలు వెల్లడించాలని, అయితే రజనీకాంత్‌ ఎవరో రాసిచ్చిన కథనాన్ని తుగ్లక్‌ వేదికపై చదివారని విమర్శించారు. ఇదిలా ఉండగా, పలు హిందూ సంస్థలకు చెందిన ప్రముఖులు రజనీకి మద్దతుగా నిలిచారు. పెరియార్‌పై చేసిన వ్యాఖ్యలపై రజనీ క్షమాపణలు కోరే ప్రసక్తే లేదని, ఈ వ్యవహారంలో కోర్టుకు వెళ్లేందుకు తాము వెనుకాడబోమని అభిమానులు తెలిపారు. కాగా, గత కొన్ని రోజులుగా న్యాయవాదుల కమిటీని ఏర్పాటుచేసి వారితో రజనీ మక్కల్‌ మండ్రం నిర్వాహకులు చర్చలు సాగిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy