చెన్నై, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ద్రవిడకళగం వ్యవస్థాపకుడు పెరియార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కమిటీ కార్యదర్శి హెచ్. రాజా మద్దతు ప్రకటించారు. రాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ మంత్రి కేఏ సెంగోటయ్యన్ నిరసన వ్యక్తం చేశారు. ఈనెల 14న చెన్నైలో జరిగిన 'తుగ్లక్' పత్రిక స్వర్ణోత్సవ సభలో రజనీ మాట్లాడుతూ తుగ్లక్ సంపాదకుడు చో రామసామి ప్రముఖ పత్రికలు ప్రచురించడానికి సాహసించని వార్తలను తన పత్రికలో ప్రచురించేవారని, అలాగే 1971లో సేలంలో జరిగిన సభలో పెరియార్ హిందువుల దేవతామూర్తులైన శ్రీరాముడు, సీతాదేవి విగ్రహాలకు చెప్పులమాల వేసి నగ్నంగా ఊరేగించారని, ఆ వార్తను ఇతర పత్రికలు ప్రచురించలేదని, చో ధైర్యంగా తన పత్రికలో ప్రచురించారని అన్నారు.
ఈ వాఖ్యలపైనే రజనీపై చెన్నై, తిరుప్పూరు, కోయంబత్తూరు తదితర నగరాలలోని పోలీసుస్టేషన్లలో పెరియార్ ద్రవిడ కళగం స్థానిక శాఖల నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయకమిటీ కార్యదర్శి హెచ్. రాజా చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ రజనీ వ్యాఖ్యలపై పోలీసులకు ఎన్ని ఫిర్యాదులు చేసిన ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేరని ప్రకటించారు. రజనీ వ్యాఖ్యలు వాస్తవమేనని పెరియార్ పలు సభలలో హిందువుల విగ్రహాలను కళంకపరిచారని అన్నారు. రజనీ పై పోలీసులు కేసులు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకునేందుకు అవకాశం లేదని, కోర్టుకెళితే ఆ కేసులు నిలబడవని కూడా అన్నారు.
ఇక రాష్ట్ర మంత్రి కేఏ సెంగోటయ్యన్ రజనీ పెరియార్‌పై చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోడ్ జిల్లా గోపిశెట్టిపాళయం బస్టాండు వద్ద ఆదివారం ఉదయం పోలియో శిబిరం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా విలేకరులతో సెంగోటయ్యన్ మాట్లాడుతూ పెరియార్ గురించి రజనీ అసందర్భంగా అవాస్తవమైన విమర్శలు చేసి దివంగత నాయకుడి కీర్తి ప్రతిష్టలకు కళంకం కల్పించారని ఆరోపించారు.
