హైదరాబాద్, జులై 31 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు.
టోక్యో, న్యూయార్క్‌తో పోటీ పడే తెలంగాణ తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు (శుక్రవారం) మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సీఐఐ నార్తర్న్ రీజినల్ కౌన్సిల్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు రామకృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. పెట్టుబడులకు అత్యంత సురక్షిత రాష్ట్రం తెలంగాణ అని ఉద్ఘాటించారు. రండి... తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని పిలుపునిచ్చారు. 2047 నాటికి తెలంగాణ రైజింగ్ (Telangana Rising) చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని వ్యాఖ్యానించారు.
దేశ జీడీపీలో తెలంగాణ వాటాను పదిశాతానికి పెంచడమే మా లక్ష్యం..
దేశ జీడీపీలో తెలంగాణ వాటాను పదిశాతానికి పెంచడమే తమ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. 2037 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మారుస్తామని చెప్పుకొచ్చారు. పాలసీ పెరాలసిస్ తెలంగాణలో లేదని అభిప్రాయపడ్డారు. మంచి విధానాలు ఏ పార్టీవైనా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. CORE- PURE - RARE మోడల్‌తో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డును పారిశ్రామికంగా విస్తరణ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. భారత్ ఫ్యూచర్ సిటీ - మచిలీపట్నం 12 లేన్ల రహదారిగా విస్తరిస్తున్నట్లు వివరించారు. China Plus One వ్యూహంలో తెలంగాణ కీలకమని వెల్లడించారు. తయారీ, సేవలు, వ్యవసాయ రంగాల్లో భారీ పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు.
తెలంగాణకు మూడు బుల్లెట్ రైళ్లు..
తెలంగాణకు మూడు బుల్లెట్ రైళ్లు రానున్నాయని సీఎం వివరించారు. ఏఐ సునామీకి తగ్గట్లుగా స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో ఉద్యోగ నైపుణ్యాలను పెంచుతున్నామని చెప్పుకొచ్చారు. ఏటీసీల్లో చదివిన వారికి వందశాతం ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అమెజాన్, అదానీ సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్లు వివరించారు. ప్రపంచ టాప్-500 కంపెనీలను తెలంగాణకు తీసుకురావడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. 'Think Global... Invest Glocal' అంటూ పెట్టుబడిదారులకు సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ అంటే వ్యాపారమని... ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...

