అడ్మిషన్ స్థాయిలోనే తోసిపుచ్చిన హైకోర్టు
విచారణకు అర్హమైంది కాదని వ్యాఖ్య
ఒంగోలు విద్య, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్యపై రావూరి దిలీప్‌కుమార్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది.
అడ్మిషన్ స్థాయిలోనే తోసిపుచ్చుతూ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. పిటిషనర్ ఆరోపణలపై సుదీర్ఘ విచారణ చేసి అసలు విచారణకు అర్హమైంది కాదని వ్యాఖ్యానించారు. సొసైటీలో పిటిషనర్ చేసిన అవినీతి గురించి కూడా విచారణలో ప్రస్తావనకు వచ్చింది. బ్యాంకులో పిటిషనర్ కేవలం సేవింగ్స్ అకౌంట్‌దారునిగా ఉండి, బ్యాంకుకు ప్రభుత్వం నియమించిన పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీ(పీఏసీ)ని రద్దుచేయమనడం, సెక్షన్ 51 కింద సమగ్ర విచారణ కోరడం, ఇతర తీవ్రఆరోపణలు చేయడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఈమేరకు పిటిషనర్ కౌన్సిల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

