భూపాలపల్లి,మే 21: మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామున 5:43 గంటలకు కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం ఆచరించి..
ఈ పుష్కరాలను ప్రారంభించారు. మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పలువురు ప్రజాప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులు నదిలో పుణ్య స్నానం ఆచరించారు.
ఈ పుష్కరాల్లో పాల్గొనేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ అంత్య పుష్కరాలు జరగనున్నాయి. ఈ పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 200 కోట్ల కేటాయించిన సంగతి తెలిసిందే.
ఈ అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 2025, మే 15వ తేదీన సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఇవి మే 26వ తేదీతో ముగిశాయి. వీటిని ఆది పుష్కరాలు అని అంటారు. ఈ సరస్వతి నది అంత్య పుష్కరాలతో ఇవి ముగియనున్నాయి.

