Dailyhunt
ప్రభుత్వ ఉద్యోగిగా మారిన రింకు సింగ్..

ప్రభుత్వ ఉద్యోగిగా మారిన రింకు సింగ్..

స్పోర్ట్ డెస్క్: టీమిండియా పవర్ హిట్టర్, టీ20 ప్రపంచ కప్ 2026 విజేత రింకు సింగ్‌కు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. అతడిని రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా యోగి సర్కార్ నియమించింది.

ఈ మేరకు ఇవాళ(మంగళవారం) లఖ్‌నవూలోని లోక్ భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నియామక పత్రాన్ని రింకుకు సీఎం యోగి ఆదిత్య నాథ్ అందజేశారు. పొట్టి ప్రపంచ కప్ సమయంలోనే రింకు తండ్రి మరణించిన సంగతి తెలిసిందే.

అంతటి విషాదంలో ఉండి కూడా తండ్రి అంత్యక్రియలు ముగిసిన వెంటనే తిరిగి జట్టుతో చేరి తన అంకిత భావాన్ని చాటుకున్నాడు. రింకు టీ20 ప్రపంచ కప్ 2026లో మొత్తం 5 ఇన్నింగ్స్‌లో 24 పరుగులు మాత్రమే చేశాడు. ఈ అన్ని మ్యాచ్‌లలో అతడు ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 బంతుల్లోనే 11 పరుగులు చేశాడు. ప్రపంచ కప్2026లో అతడి అంకితభావానికి గుర్తింపుగా యోగి ప్రభుత్వం ఈ ఉద్యోగంతో సత్కరించింది. రింకు సింగ్ పొందిన పోస్ట్ గ్రూప్-ఏ కిందికి వస్తుంది. జీతం, అలవెన్సులతో కలిపి రూ. 70,000 వరకు చేతికి అందుతుంది.

ఇ​‍క రింకు సింగ్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మరో ఐదుగురు అథ్లెట్లకు కూడా యూపీ ప్రభుత్వం ఉద్యోగాలను ప్రకటించింది. రాజ్‌కుమార్ పాల్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా హైజంప్), అజిత్ సింగ్, సిమ్రాన్‌లను కూడా గ్రూప్-1లో వివిధ పోస్టుల్లో యూపీ ప్రభుత్వం నియమించింది. 2024-25 సంవత్సరానికి గాను తొమ్మిది మంది క్రీడాకారులకు రాష్ట్ర అత్యున్నత పురస్కారాలైన లక్ష్మణ్ అవార్డు, రాణి లక్ష్మీబాయి అవార్డులను అందజేశారు. వీరికి రూ. 3.11 లక్షల నగదు బహుమతితో పాటు కాంస్య విగ్రహాన్ని బహూకరించారు.

లక్ష్మణ్ అవార్డు గ్రహీతలు:

  • ఉత్తమ్ సింగ్ (ఘాజీపూర్) - హాకీ

  • వినయ్ (వారణాసి) - పారా పవర్ లిఫ్టింగ్

  • అభిజీత్ కుమార్ (ప్రయాగ్రాజ్) - జిమ్నాస్టిక్స్

  • విక్రాంత్ బలియన్ (మీరట్) - రెజ్లింగ్

  • సాగర్ డాంగి (బాగ్‌పత్) - షూటింగ్

రాణి లక్ష్మీబాయి అవార్డు గ్రహీతలు:

  • భాను పాఠక్ (గోరఖ్‌పూర్) - పర్వతారోహణ

  • దీపక్ కుమార్ (ఘజియాబాద్) - పర్వతారోహణ

  • తాన్యా చౌదరి (సహారన్‌పూర్) - అథ్లెటిక్స్

  • తనుశ్రీ పాండే (లఖ్‌నవూ ) - సాఫ్ట్ టెన్నిస్

  • ఓం యాదవ్ - సాఫ్ట్ టెన్నిస్

  • రాజ్‌కుమార్ పాల్ (ఘాజీపూర్) - హాకీ

  • యష్ కుమార్ (ఆగ్రా) - పారా కానోయింగ్

  • ముస్కాన్ యాదవ్ (ప్రయాగ్రాజ్) - సాఫ్ట్ టెన్నిస్

ప్లేయర్లు తొలి మ్యాచ్ నుంచే ఫిట్‌గా ఉండాలి.. రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు

పేసర్లు కూల్‌గా ఉంటానంటే నేను ఒప్పుకోను: శుభ్‌మన్ గిల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy