Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజలను మభ్యపెట్టడానికే ఏకగ్రీవాలు: కాల్వ శ్రీనివాసులు

ప్రజలను మభ్యపెట్టడానికే ఏకగ్రీవాలు: కాల్వ శ్రీనివాసులు

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. 'ప్రజాస్వామ్య విలువలకు అడుగుడుగునా పాతరేస్తున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఆదేశాలతో విధిలేని పరిస్థితుల్లోనే ఎన్నికల నిర్వహణకు పూనుకుంది. ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఇస్తున్న ప్రకటనలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటుహక్కుని దుర్వినియోగం చేసేలా ప్రభుత్వ చర్యలున్నాయి. ఎన్నికలకు సహకరించాల్సిన సర్కారు, అభూతకల్పనలతో ప్రజలను మభ్యపెట్టడానికే ఏకగ్రీవాల పేరుతో ప్రకటనలిచ్చింది.

ప్రభుత్వమిచ్చిన ప్రకటనల్లోని సచివాలయం నమూనా ఏ రాష్ట్రం లోనిదో సజ్జల సమాధానం చెప్పాలి. సాంకేతిక కారణాలు సాకుగా చూపి, ప్రతిపక్ష పార్టీలకు చెందిన మద్దతుదారులు ఎన్నికల్లో పోటీచేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది' అని ఆరోపించారు.

'ప్రభుత్వం ఆది నుంచీ ఎన్నికలకు మొగ్గుచూపకపోవడం, ఓటర్ల జాబితాను ఎస్ఈసీకి సమర్పించకపోవడం, ఎన్నికలను అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్లడాన్ని బట్టే, పాలకులు ఎన్నికలకు భయపడుతున్నారని అర్థమైంది. ప్రభుత్వ దుర్మార్గాలు, దుర్నీతిని అడ్డుకొని, వైసీపీ సానుభూతిపరులకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడానికి ప్రజలంతా ఇప్పటికే సన్నద్ధులై ఉన్నారు. ప్రజలు తమకు ఓటేస్తారనే భావన నిజంగా వైసీపీ ప్రభుత్వానికి ఉంటే ఓటుహక్కుని సద్వినియోగ పరుచుకునే అవకాశాన్ని ఓటర్లకు కల్పించాలి' అని డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy