Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజలు ప్రభుత్వానికి బానిసలు కారు

ప్రజలు ప్రభుత్వానికి బానిసలు కారు

  • సర్కారు నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు వారికి ఉంది

  • నిరసన కార్యక్రమాలూ చేపట్టొచ్చు

  • అది రాజ్యాంగం కల్పించిన హక్కు

  • ఈ విషయంలో పౌరుల నగర బహిష్కరణ చెల్లదు

  • బాంబే హైకోర్టు ఆదేశాలు

  • పోలీసులు ముఖ్యమంత్రి, ప్రధానికి సేవకులు కాదని వ్యాఖ్య

ముంబై: ''దేశ పౌరులను భారత ప్రభుత్వానికి బానిసలుగా మారుస్తున్నారా? వారు నిరసన ప్రదర్శనలు చేయకూడదా? నిరసిస్తే కేసులతో వేధిస్తారా? నిరసన వ్యక్తం చేయడం పౌరుల హక్కు. పిటిషనర్‌ కేవలం బీజేపీ ప్రభుత్వం డౌన్‌ డౌన్‌, అమిత్‌షా డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. అలాంటి నినాదాలు ఇవ్వకూడదా? వాటికే సమాజం నుంచి వెలి వేస్తారా?'' ఓ వ్యక్తి నగర బహిష్కరణ కేసులో విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇవి. మహారాష్ట్రలోని కొంకణ్‌ ప్రాంతానికి చెందిన సమీద్‌ అహ్మద్‌ అబ్దుల్‌ వాహిద్‌ చౌదరి (49) సోషలిస్ట్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా జనరల్‌ సెక్రటరీ. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టంతోపాటు జ్ఞానవాపి మసీదు వివాదం తదితర సున్నిత అంశాలకు వ్యతిరేకంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఏడాది పాటు ఆయన్ని నగరం నుంచి బహిష్కరిస్తూ కొంకణ్‌ ప్రాంత డిప్యూటీ పోలీసు కమిషనర్‌ 2025 డిసెంబర్‌ 3న ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని డివిజనల్‌ పోలీసు కమిషనర్‌ కూడా 2026 మార్చి 27న సమర్థించారు.

దీంతో వాహిద్‌ చౌదరి న్యాయం కోరుతూ బాంబే హైకోర్టు తలుపు తట్టారు. ఈ ఆదేశాలను జారీ చేసిన పోలీసులను జస్టిస్‌ మాధవ్‌ జామ్‌దార్‌ కడిగి పారేశారు. ప్రభుత్వ నిర్ణయాలను విభేదించినందుకు పౌరులను బహిష్కరించే హక్కు పోలీసులకు లేదని తేల్చి చెప్పారు. పోలీసులు ముఖ్యమంత్రి లేదా ప్రధాన మంత్రి సేవకులు కాదని, వారు ప్రజా సేవకులని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం రాజకీయ బేరసారాలు నడుస్తున్నాయంటూ.. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలను మారుస్తుంటే వారిపై ఏమైనా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారా? అని పోలీసులను నిలదీశారు. పౌరులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడమే కాకుండా, గౌరవంగా జీవించే హక్కుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19, 21 హామీ ఇస్తున్నాయని స్పష్టం చేస్తూ వాహిద్‌ చౌదరిపై బహిష్కరణ ఆదేశాలను న్యాయమూర్తి కొట్టివేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy