Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రళయ నేపాలం

ప్రళయ నేపాలం

మాటలకు అందని మహావిషాదం ఇది. హిమాలయ దేశం నేపాల్‌లో సంభవించిన వరదలు వందలాది కుటుంబాలను బలితీసుకున్నాయి. మృతుల సంఖ్య మూడువందలు దాటడంతోపాటు, వేలాదిమంది ఆచూకీ తెలియరాలేదు.

నేపాల్ వరదల ఉగ్రరూపం, విధ్వంసం హిమాలయాల అతిసున్నితమైన, అస్థిర పర్యావరణానికి ప్రబల నిదర్శనం. వాతావరణ మార్పు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న తరుణంలో, కంటికి కనిపించే ఆ అందమైన మంచుపర్వతాల వెనుక జరుగుతున్నదేమిటో తెలుసుకోలేకపోతే ఇటువంటి అనేక విపత్తులు చూడవలసి వస్తుందని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.

మాధ్యమాల్లో విస్తృతంగా కనిపిస్తున్న ఆ దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. వరద, బురద కలగలసి అతివేగంగా దిగువకు జారి వందలాదిగ్రామాలను నామరూపాలు లేకుండా చేశాయి. నేపాల్--చైనా సరిహద్దుకు టిబెట్ వైపున ఉన్న పర్వత సమూహం నుంచి ఒక భారీ కొండచరియ విరిగిపడి, లెండే--భోటే కోసి--త్రిశూలి నదీ వ్యవస్థ గుండా అమితవేగంతో ప్రవహించడంతో వేలాదిమంది గల్లంతయ్యారు, ఆరు జలవిద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి, నేపాల్--చైనా సరిహద్దు ద్వారం కొట్టుకుపోయింది. ఉగ్రరూపం దాల్చిన నదులు గట్లను తెంచుకుంటూ, భవనాలను, రోడ్లను, ఇళ్ళనూ ముంచెత్తుతూ, దారిలో ఉన్న ప్రతీదానినీ కబళిస్తూ, ప్రాణభయంతో పరుగులు తీస్తున్నవారిని సైతం తమలో కలిపేసుకున్న ఆ దృశ్యాలు మనలను ఎంతోకాలం వెంటాడుతాయి. అధ్యయనాలు, విశ్లేషణలు మరింత లోతుగా, నిర్దిష్టంగా సాగి, ఈ విధ్వంసానికి మూలకారణం తేలడానికి అనేక నెలలు పట్టవచ్చు. ఈ జలప్రళయానికి మంచుకొండల్లో సంభవించిన భూకంపమా, హిమనీ సరస్సు విస్ఫోటనమా తేలాల్సి ఉంది.

కనీసం ఏడున్నర నిముషాల ముందు ౪.4 తీవ్రతతో సంభవించిన ప్రకంపనలే ఈ గొలుసుకట్టు పరిణామాలను సృష్టించాయని కొందరు అంటారు. కొండచరియలు విరిగిపడిన ప్రకంపనలే ఆ స్థాయిలో ఉన్నాయని మరోవాదన. ఏది నిజమైనప్పటికీ, అక్కడ 5.2 తీవ్రత గల భూకంపడం నమోదుకావడం ఈ విషాదం తీవ్రతకు రుజువు. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులోని భోటేకోషి నదీప్రవాహం మొదలయ్యే దగ్గర కొత్తగా మరో సరస్సు ఏర్పడిందని, రెండు మూడురోజుల్లో అది తెగిపోవచ్చునని నేపాల్‌కు ఇప్పుడు మరో ప్రమాదహెచ్చరిక వినబడుతోంది. ఇప్పటికే పొంగిపొర్లుతున్న టిబెట్‌లోని రెండునదుల సంగమస్థలం అతివేగంగా ముప్పైలక్షల క్యూబిక్‌ మీటర్ల నీటిని నింపుకొని నేపాల్‌ను ముంచెత్తవచ్చునన్నది ఆ హెచ్చరిక సారాంశం. కొద్దినిముషాల్లోనే ఆరు జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, విద్యుత్‌ లైన్లు, సబ్‌స్టేషన్లు కొట్టుకుపోవడం, నేపాల్‌ సగర్వంగా చాటుకుంటున్న 25మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు బురదలో కూరుకుపోవడం వంటి విషాదాలు గమనించినప్పుడు ప్రకృతితో సమన్వయం లేకుండా సాధించే అభివృద్ధిని నిలబెట్టుకోవడం కష్టమని అర్థమవుతుంది. ఏడాది క్రితం జెన్‌జీ తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే నేపాల్‌ ప్రధాని బాలెన్‌ షా సమర్థతకు ఈ జలప్రళయం అతి పెద్దపరీక్ష పెట్టింది. నేపాలీల్లో ఆయనపట్ల నమ్మకం సడలిపోతోందని విశ్లేషణలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో, ఈ సంక్షోభసమయంలో ఆయన తన సమర్థతను రుజువుచేసుకోవాల్సి ఉంది. వాతావరణ మార్పులతో ముడిపడిన ఈ తరహా విపత్తులు భవిష్యత్తులో ఎదుర్కోవడానికి నేపాల్‌కు ఒక సమర్థవంతమైన వ్యూహాన్ని సిద్ధం చేయాల్సిన బాధ్యత కూడా ఆయనమీద ఉంది.

ఉత్తరాఖండ్ నుండి సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ వరకు, భారతదేశం సైతం హిమాలయ ప్రమాదాలను ఎదుర్కొంటోంది. వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో, పర్యాటక వ్యామోహంలో అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న నిర్మాణాలతో కొండచరియలు అస్థిరంగా మారి ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. పైన ఆ మంచుపర్వతాల్లో జరుగుతున్నదేమిటో తెలుసుకోకుండా రహదారులు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, సొరంగాల వంటి నిర్మాణాలు సాగిపోతున్నాయి. హిమాలయ సానువుల్లో సంభవించే ప్రతి విషాదం మరో భారీ ప్రమాదానికి సంకేతమే. సరిహద్దు వివాదాలకు పరిమితమవుతున్న ప్రభుత్వాలకు ఈ మెరుపు వరదలు ఒక హెచ్చరిక. సరిహద్దులు దాటిన ఇలాంటి విషాదాల విషయంలో దేశాల మధ్య సహకారం అత్యవశ్యకం. పూర్తిసమన్వయంతో, అత్యాధునిక సాంకేతికతల సాయంతో నిరంతరం కచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తూ అందరూ పంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి బీభత్సాలను నివారించలేకపోయినా, ప్రమాదహెచ్చరికలతో వేలాదిప్రాణాలు కాపాడుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy