Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్‌ కంపెనీగా టీసీఎస్‌

ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్‌ కంపెనీగా టీసీఎస్‌

న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద ఏఐ ఆధారిత టెక్నాలజీ సేవల కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీసీఎస్‌ సీఈఓ, ఎండీ కే కృతివాసన్‌ తెలిపారు.

తమ టాప్‌ 139 క్లయింట్లలో ఇప్పటికే 130 మంది తమ ఏఐ సేవల భాగస్వామిగా టీసీఎస్‌ను ఎంచుకున్నారని 2025-26 ఆర్థిక సంవత్సర నివేదికలో పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరాన్ని (2025-26) ఎంటర్‌ప్రైస్‌ ఏఐ సేవల పరివర్తన కాలంగా ఆయన అభివర్ణించారు. ఈ సాంకేతిక మార్పుకు అనుగుణంగా తమ సిబ్బందికి ఏఐ వంటి ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నామన్నారు. ఇప్పుడు సంస్థలో 2.70 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఏఐ నైపుణ్యాలను కలిగి ఉన్నారని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏఐ నైపుణ్యం కలిగిన సిబ్బంది మూడింతలయ్యారని వార్షిక నివేదికలో కృతివాసన్‌ ప్రస్తావించారు.

మేధో మౌలిక వసతిగా ఏఐ: చంద్రశేఖరన్‌

కృత్రిమ మేధ(ఏఐ) కేవలం సాంకేతిక కాదని ప్రపంచవ్యాప్తంగా సంస్థలకు మేధో మౌలిక వసతిగా మారుతోందని దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ అన్నారు. టీసీఎస్‌ 'హ్యూమన్‌ ప్లస్‌ ఏఐ' ఆపరేటింగ్‌ మోడల్‌ను విస్తరిస్తున్నదని, ఏఐ సేవల ద్వారా 230 కోట్ల డాలర్లు.. క్లౌడ్‌, డేటా, సైబర్‌ సెక్యూరిటీ వంటి ఆధునిక సేవల ద్వారా 1,150 కోట్ల డాలర్ల వార్షిక ఆదాయాన్ని సాధించిందని కంపెనీ 2025-26 ఆర్థిక సంవత్సర నివేదిక ద్వారా వాటాదారులకు తెలిపారు. సంస్థల పెట్టుబడులు, సరఫరా వ్యవస్థ నిర్వహణ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, సంబంధిత వర్గాలకు సేవలందించే తీరును ఏఐ సమూలంగా ప్రభావితం చేయనుందన్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ అత్యంత భద్రమైన, చురుకైన, చట్టబద్ధమైన ఏఐ మౌలిక వసతిని ఏర్పాటు చేయాలనుకుంటోందన్నారు. ఏజెంటిక్‌ ఏఐ పరిష్కారాలందించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇండస్ట్రీల అవసరాలకు అనుగుణమైన ఏఐ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు చంద్రశేఖరన్‌ తెలిపారు.

కృతివాసన్‌కు రూ.28 కోట్ల పారితోషికం: టీసీఎస్‌ సారథిగా కృతివాసన్‌ గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.28 కోట్ల పారితోషికం అందుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024-25) తో పోలిస్తే ఆయన ప్యాకేజీ 6.3 శాతం పెరిగింది. టీసీఎస్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ మాత్రం కంపెనీ నుంచి ఎలాంటి కమీషన్‌ తీసుకోలేదు. పూర్తి ఏడాది కాలానికి సిట్టింగ్‌ ఫీజు కింద ఆయనకు కేవలం రూ.4.2 లక్షలు లభించాయి.

ఏఎస్ఎంఎల్‌తోటాటాఎలక్ట్రానిక్స్ జట్టు

భారత్‌లో సెమీకండక్టర్ల (చిప్‌) తయారీ కోసం టాటా ఎలక్ట్రానిక్స్ నెదర్లాండ్స్‌కు చెందిన చిప్‌ యంత్రాల దిగ్గజం ఏఎస్ఎంఎల్‌తో చేతులు కలిపింది. ప్రధాని మోదీ నెదర్లాండ్స్‌ పర్యటన సందర్భంగా ఈ భాగస్వామ్యం కుదిరింది. ఇందులో భాగంగా గుజరాత్‌లోని ధోలెరాలో టాటా ఎలక్ట్రానిక్స్ చిప్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ఏఎస్ఎంఎల్‌ సహకరించనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy