Dailyhunt
ప్రతి పేదవాడికి రెండు పడకల ఇండ్లు ఇవ్వడమే నా సంకల్పం: పోచారం

ప్రతి పేదవాడికి రెండు పడకల ఇండ్లు ఇవ్వడమే నా సంకల్పం: పోచారం

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి రెండు పడకల గదుల ఇండ్లను ఇవ్వడమే నా సంకల్పమని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రూ. 2.52 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండలం బరంగ్ఎడ్గి గ్రామంలో నూతనంగా నిర్మించిన 50 డబుల్ బెడ్ రూం ఇళ్ళను ఆయన ప్రారంభించి, లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు.

ఈసందర్భంగా జరిగిన గ్రామ సభలో స్పీకర్ గారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఆత్మ గౌరవం కాపాడటానికి డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం ప్రవేశపెట్టారని తెలిపారు.ధనవంతులకైనా, బీదవారికైనా తోడు,గూడు తప్పనిసరి.

పేదవారు రూపాయి కూడా తిరిగి కట్టనవసరం లేకుండా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షల 4వేలు ఇస్తున్నారు. ఈ విధంగా డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వడంతో స్థలంతో కలిపి ఒక్కోక్క లబ్ధిదారుడికి సుమారు రూ.10లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.

బాన్సువాడ నియోజకవర్గానికి అయిదు వేల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు అయ్యి నిర్మాణంలో ఉన్నాయి. అందులో మెజారిటీ పూర్తి అయినవి, వాటిని లబ్దిదారులకు అందజేశామన్నారు.బాన్సువాడ నియోజకవర్గంలో 221గ్రామాలు ఉండగా అందులో 110 గ్రామాల్లో డబల్ బెడ్ రూమ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఇంకా ఆరు వేల ఇండ్లు మంజూరుచేయించి గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు అందిస్తాను.

పేదవారి కోసం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగితే, అనర్హులకు ఇండ్లు ఇచ్చినట్లైతే ఆ ఇండ్లు వాపస్ తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇల్లు లేని నిరుపేదలకు స్వంత ఇంటిని అందిస్తుంటే వారికంటే నాకే ఎంతో సంతోషంగా ఉందని సభాపతి పోచారం వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy