హైదరాబాద్, ఆగస్టు 28: రక్షాబంధన్‌ను పురస్కరించుకుని సోదరులకు రాఖీ కట్టేందుకు ఆడబిడ్డలు ఊర్లకు పయనమయ్యారు. రాఖీ పండుగతో పాటు వరుస సెలవులు కావడంతో నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరారు.
దీంతో భాగ్యనగరంలోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ బస్టాండ్లలో రద్దీ నెలకొంది. రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్‌ఆర్టీసీ.. దాదాపు 5 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అలాగే డిమాండ్ ఉన్న రూట్లలో అదనంగా సిటీ బస్సులను నడుపుతోంది.
ఈ నెల 27 నుంచి 31 వరకు 5 వేల ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపనుంది. గతేడాది కంటే అదనంగా 240 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉప్పల్ నల్లచెరువు వద్ద తాత్కాలిక బస్టాండ్‌ను ఏర్పాటు చేశారు. నల్లచెరువు నుంచి వరంగల్, హన్మకొండ, నర్సంపేట, జనగాం, యాదాద్రి, తొర్రూరు వైపు ప్రత్యేక బస్సులు వెళ్లనున్నాయి. రద్దీ ఉన్న రూట్లలో అదనపు సర్వీసులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీపై 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నారు. రాఖీ పండుగతో పాటు లాంగ్ వీకెండ్ కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. రాఖీ రోజు తర్వాత తిరుగు ప్రయాణాల్లోనూ రద్దీ ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
/strong>

