Dailyhunt
రామమందిర విరాళాల్లో గోల్‌మాల్: ప్రియాంక

రామమందిర విరాళాల్లో గోల్‌మాల్: ప్రియాంక

లఖ్‌నవూ: రామమందిరం కోసం సేకరించిన విరాళాల్లో గోల్‌మాల్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే రామమందిరం కోసం కేటాయించిన భూమి స్వాధీనంలో అవినీతి జరిగినట్లు సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. వీటికి కొనసాగింపు అన్నట్లుగా విరాళాలు పక్కదారి పడుతున్నాయని ప్రియాంక ఆరోపణలు చేయడం అగ్గికి ఆజ్యం పోసినట్టైంది.

ఈ విషయమై సోమవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించిన ప్రియాంక గాంధీ ''కోట్లాది మంది భక్తులు ఎంతో నమ్మకంతో భక్తితో తమ విరాళాలను నైవేధ్యంగా రాముడి పాదాల వద్ద ఉంచారు. అలాంటి విరాళాలను దుర్వినియోగం చేయడం అన్యాయం, పాపం.

ఇది రామ భక్తుల విశ్వాసాన్ని అవమానించడం'' అని ట్వీట్ చేశారు. రెండు కోట్లకు తీసుకోవాల్సిన భూమిని ఉద్దేశపూర్వకంగా 18.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని, ఆ ముడుపులు ఎవరికి ముట్టాయని ఆప్ నేత సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే. దేశంలో అతిపెద్ద అసెంబ్లీ అయిన యూపీలో 403 స్థానాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీకి 2022 ఏప్రిల్-నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy