Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాంచీ స్టేడియం వద్ద తొక్కిసలాట.. ముగ్గురి పరిస్థితి విషమం

రాంచీ స్టేడియం వద్ద తొక్కిసలాట.. ముగ్గురి పరిస్థితి విషమం

ఇంటర్నెట్ డెస్క్: జార్ఖండ్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా..

ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రేక్షకుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో మంగళవారం స్టేడియం వెస్ట్ గేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించారు. మ్యాచ్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభిమానులు స్టేడియం గేట్ల వద్దకు రావడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గేట్ వద్ద భద్రతా తనిఖీలు నెమ్మదిగా సాగడంతో బయట వేచి ఉన్న అభిమానులు అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలో కొందరు ముందుకు దూసుకెళ్లడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో గేట్‌తో పాటు బారికేడ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం అదనపు భద్రతా బలగాలను మోహరించి ప్రేక్షకులను క్రమబద్ధంగా స్టేడియంలోకి అనుమతించారు. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత మ్యాచ్ యథావిధిగా కొనసాగింది.

ఈ ఘటనపై జార్ఖండ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ స్పందించారు. 'జార్ఖండ్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కొందరు గాయపడినట్లు సమాచారం అందగానే ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశాం. సివిల్ సర్జన్‌తో పాటు సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశాం. అంబులెన్సులు ఘటనాస్థలికి చేరుకున్నాయి. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నాం' అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనతో జేఎస్‌సీఏ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లు, ప్రేక్షకుల నిర్వహణ, టికెట్ వ్యవస్థ, భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. క్రీడాభిమానుల భద్రత విషయంలో నిర్వాహకులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy