Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాష్ట్ర ప్రభుత్వానికి గణనాథుడు సద్బుద్ధిని ప్రసాదించాలి: టీ బీజేపీ చీఫ్

రాష్ట్ర ప్రభుత్వానికి గణనాథుడు సద్బుద్ధిని ప్రసాదించాలి: టీ బీజేపీ చీఫ్

హైదరాబాద్, సెప్టెంబర్ 14: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ మండపాలకు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.

ప్రజా సంక్షేమం కోసం పనిచేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి 'సద్బుద్ధి'ని ప్రసాదించాలని గణనాథుడిని కోరుకున్నానని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. రైతాంగం పాడిపంటలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివారం నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతోపాటు సుఖసంతోషాలతో జీవించేలా గణనాథుడు ఆశీర్వాదం ఉండాలని అన్నారు. ఏటేటా వినాయకుడి పట్ల భక్తి ప్రపత్తులు ఇనుమడిస్తున్నాయని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో ప్రజలు భాగస్వాములు అవుతున్నారని తెలిపారు.

హైదరాబాద్ నగరంలో ఎంతో భక్తిశ్రద్ధలతోపాటు ఉత్సాహాల నడుమ గణపతి నవరాత్రులు, శోభా యాత్రలు ఘనంగా నిర్వహించే అద్భుతమైన సాంప్రదాయం ఉందని టీ బీజేపీ చీఫ్ గుర్తు చేశారు. హైదరాబాద్‌ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేలాది గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని వివరించారు. పండుగ వేడుకలు, నిమజ్జన శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసేలా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, జీహెచ్‌ఎంసీ సహా సంబంధిత శాఖలన్నీ మండపాల నిర్వాహకులకు, భక్తులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

వినాయక పూజలో ఉపయోగించే పూజా సామాగ్రి, ఆచారాలు పర్యావరణంతో ముడిపడి ఉన్నాయని టీ బీజేపీ చీఫ్ వివరించారు. వినాయక పూజలో సమర్పించే పత్రి, పూలు, పండ్లు, పసుపు వంటివన్నీ ప్రకృతితో మనకున్న గాఢమైన బంధాన్ని గుర్తుచేస్తాయని పేర్కొన్నారు. గణపతిపై భక్తితో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా మనందరి ఉమ్మడి సంకల్పం కావాలని అన్నారు. భక్తులంతా భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకుంటూనే, పర్యావరణ పరిరక్షణపై స్పృహ కలిగి ఉండాలని టీ బీజేపీ చీఫ్ ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు.

మన సంస్కృతి, సంప్రదాయాలు భవిష్యత్తు తరాలకు తెలియజేయాలి..

సనాతన ధర్మం, సంస్కృతి సంప్రదాయాలు ఉన్న దేశం.. భారత్ అని మల్కాజ్‌గిరి ఎంపీ అభివర్ణించారు. వినాయక చవితి రోజు ప్రతి ఇంట్లో గణపతి పూజ చేస్తామని వివరించారు. అన్ని రకాల విఘ్నాలు తొలగిపోవాలని ఆ దేవుడిని కోరుకుంటామని చెప్పారు. మానవత్వాన్ని చాటే గొప్ప వేదిక గణేష్ పండగ అని గుర్తు చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.

పరాయి పాలనలో భారత జాతిని హిందూ సమాజాన్ని ఒక్కటి చేయాలనే ఆలోచనతో... స్వాతంత్ర్య సంగ్రామంలో అందరూ ఒక్కటిగా జరుపుకున్న పండుగ వినాయకచవితి అని వివరించారు. భవిష్యత్తు తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలు ఏమిటో తెలిసేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. గణేష్ ఉత్సవ సమితి.. మండపాలు పెట్టిన వాళ్లందరికీ ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్ఎస్‌కు దమ్ముంటే తలసానికి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలి: మహేశ్ గౌడ్

నల్లగొండలో కేటీఆర్‌ పాదయాత్ర చేస్తే.. నేనూ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy