- తెలుగును బోధన, పరిపాలనా భాషగా అమలు చేయండి
- అరసం రాష్ట్ర మహాసభల్లో తీర్మానం
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీని స్థాపించాలని అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర 20వ రాష్ట్ర మహాసభల్లో తీర్మానించారు.
తెలుగును బోధనా, పాలనా భాషగా అమలు చేయాలని కోరారు. పుస్తకాలను కొనుగోలు చేయడం ద్వారా గ్రంథాలయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రెండ్రోజులుగా తిరుపతి బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్‌లో నిర్వహిస్తున్న మహాసభలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా సాహిత్యవేత్త ఏటుకూరి ప్రసాద్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన సాహిత్య రంగానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ, అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, వల్లూరు శివప్రసాద్, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు సాకం నాగరాజ, తిరుపతి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యువశ్రీ మురళి, నెమిలేటి కిట్టన్న, గంటా మోహన్, విశాలాంధ్ర జనరల్ మేనేజర్ హరినాథ రెడ్డి, ఆనంద్, సంజీవమ్మ, సుశీలమ్మ, కుసుమ కుమారి తదితరులు ప్రసంగించారు.
మతం పేర కుట్రలు
మతం పేరుతో ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలు చేస్తున్నారని వీటిని విద్యావంతులు, మేధావులు, సాహిత్యవేత్తలు నిలువరించాలని విప్లవ రచయితల సంఘం (విరసం) మాజీ కార్యదర్శి వి.చెంచయ్య కోరారు. మావోయిస్టు రహిత దేశాన్ని సాధిస్తున్నామని అంటున్నారే కానీ, పేదరికం, దోపిడీ లేని దేశాన్ని సాధించామని ప్రభుత్వం ప్రకటించగలదా అని ప్రశ్నించారు. అభ్యుదయ సాహిత్యంలో మహిళల పాత్ర కూడా కీలకంగా ఉందని ఎస్కేయూ మాజీ వీసీ కుసుమకుమారి అన్నారు. రిటైర్డు ప్రిన్సిపాల్ సుశీలమ్మ మాట్లాడుతూ.. తెలుగులో తొలి కథా రచయిత్రి బండారు అచ్చమాంబ అని అన్నారు. రిటైర్డు జడ్జి లక్ష్మి మాట్లాడుతూ, మహిళాభ్యుదయమే దేశాభ్యుదయమన్నారు.

