Friday, 30 Oct, 1.21 am ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు బ్రేక్‌!

పర్యావరణ అనుమతులు తప్పనిసరి.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన ఎన్‌జీటీ

అనుమతుల నుంచి తప్పించుకోవడానికే

తాగునీటి ప్రాజెక్టుగా చిత్రీకరిస్తున్నారు

సవివర ప్రాజెక్టు నివేదిక సమర్పించాలి

అది ఆమోదం పొందేదాకా ముందుకెళ్లొద్దు

డీపీఆర్‌ పరిశీలనతోనే వాస్తవ ఉద్దేశాలు తెలుస్తాయి

పర్యావరణ ప్రభావం లేదనడం సరికాదు

అధ్యయనం జరగనిదే నిర్ణయానికి రాలేం

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, నారాయణపేట టౌన్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ముందస్తు పర్యావరణ అనుమతులు పొందకుండా రాయసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై ముందుకెళ్లవద్దని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. ముందస్తు అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడానికి గాను ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేవంటూ తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్‌ కే రామకృష్ణన్‌, సభ్య నిపుణుడు సైబల్‌ దాస్‌ గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం దానిపై విచారణ జరిపి, తుది తీర్పు వెలువరించింది.

కృష్ణా బోర్డుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సమర్పించి, ఆమోదించేంత వరకు ఈ ప్రాజెక్టుకు ముందుకెళ్లవద్దని రాష్ట్రప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ సూచించిన నేపథ్యంలో.. కృష్ణా బోర్డు నుంచి ముందస్తు అనుమతులు అవసరమా లేదా అన్న అంశంలోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్రం ఆదేశాలకు రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉంటుందని భావిస్తున్నామని తెలిపింది.

ఇది కొత్త ప్రాజెక్టు కాదని, ఇది రాయలసీమ ప్రాంతానికి తాగునీరు అందించడానికి చేపడుతున్న విస్తరణ ప్రాజెక్టు అని, కాబట్టి దీనికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఏపీ ప్రభుత్వం చేసిన వాదనలను ఎన్జీటీ తోసిపుచ్చింది. ఇందులో సాగునీటి కంపోనెంట్‌ కూడా ఉందని తేల్చింది. అలాగే, తాము నియమించిన సంయుక్త కమిటీ పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఇచ్చిన నివేదికను కూడా పక్కనబెట్టింది.

అందుకే అలా..

పర్యావరణ అనుమతులు పొందే ప్రక్రియను తప్పించుకోవడానికే..ఈ ప్రాజెక్టులో సాగునీటి కంపోనెంట్‌ లేదని, కేవలం తాగునీటి ప్రాజెక్టు మాత్రమేనని నిర్ణయానికి వచ్చేలా ఈ ప్రాజెక్టును చిత్రీకరించారని ఎన్జీటీ అభిప్రాయపడింది. 'ఈ ప్రాజెక్టు అసలు ప్రయోజనాలు ఏమిటో తెలిసేలా కార్పొరేట్‌ ముసుగును తొలగించడమే మా పని' అని పేర్కొంది. 'ఈ నీటిని ఎలా వినియోగించుకుంటారు? తాగునీటి ద్వారా లేదా సాగునీటి ద్వారా ఎంత విస్తీర్ణంలో ఎంత మందికి లబ్ధి జరుగుతుంది? వంటి అంశాలతో కూడిన డీపీఆర్‌ను అధ్యయనం చేస్తేనే ఈ ప్రాజెక్టు వాస్తవ ఉద్దేశం అర్థమవుతుంది.' అని వ్యాఖ్యానించింది.

రాయలసీమలో కరువును ఎదుర్కొనేందుకు ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని చెబుతున్నప్పుడు ఇది కచ్చితంగా ఆ ప్రాంత వ్యవసాయ ప్రయోజనాలపై కూడా ప్రభావం చూపిస్తుందని.. ప్రాజెక్టు ఉద్దేశంలో ఇవేమీ పేర్కొనలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది కేవలం తాగునీటి ప్రాజెక్టు అని చెప్పలేమని, ఇందులో ఇరిగేషన్‌ కంపోనెంట్‌ కూడా ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుత కాలువల ద్వారా తోడుకుంటున్న నీరు రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయ ప్రయోజనాలకు సరిపోవట్లేదన్న ఉద్దేశంతో ఆ ప్రాంతంలో సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రాజెక్టును విస్తరిస్తున్నట్లు అర్థమవుతోందని పేర్కొంది.

పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల కూసెక్కులకు పెంచాలని ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో అందులో ఎంత మేరకు నీరు తాగునీటి కోసం వినియోగిస్తారో స్పష్టత లేదని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. 'సామర్థ్యం పెంచి ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు నీటిని తరలిస్తామని చెబుతున్నారు. ఆ ప్రాజెక్టులకు మంజూరైన పర్యావరణ అనుమతుల్లో ఇరిగేషన్‌ కంపోనెంట్‌ కూడా ఉంది. మరి రాయలసీమ ప్రాజెక్టును వాటికి అనుబంధ ప్రాజెక్టు అని భావిస్తే సాగునీటికి సంబంధించి ఎంత విస్తీర్ణంలో భూమికి నీళ్లు అందుతాయి..? ఈ అంశాలపై స్పష్టత లేదు' అని వ్యాఖ్యానించింది.

ఆమోదయోగ్యం కాదు

తెలుగు గంగ ప్రాజెక్టు, శ్రీశైలం కుడి కాలువ, గాలేరు నగరి, చెన్నైకి తాగునీరు, ముచ్చుమర్రి ప్రాజెక్టులకు కేటాయించిన నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల నీటి స్థాయి వద్ద నుంచి తోడుకునే అవకాశం ఉందని.. కానీ 854 అడుగుల వద్ద నీటి లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తోడుకోలేకపోతున్నారని.. అందుకే 800 అడుగుల వద్ద రాయసీమ ప్రాజెక్టుతో లిఫ్ట్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిందని సంయుక్త కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ఎన్జీటీ తప్పుబట్టింది.

తెలుగు గంగకు, శ్రీశైలం కుడికాలువకు ఏ ప్రాతిపదికన నీళ్లు తోడుకుంటారో స్పష్టత లేదని, గాలేరు-నగరి సామర్థ్యం 38 టీఎంసీలేనని, ఈ నేపథ్యంలో గ్రావిటీ ద్వారా కాకుండా లిఫ్టుల ద్వారా నీటిని తోడుకునే స్థాయిని 854 అడుగుల నుంచి 800 అడుగులకు మార్చడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని కమిటీ వ్యక్తం చేసిన అభిప్రాయం ఆమోదయోగ్యంగా లేదని స్పష్టం చేసింది. ఈ అంశంలో కమిటీ సభ్యుడిగా ఉన్న హైదరాబాద్‌ ఐఐటీ ప్రొఫెసర్‌ శశిఽధర్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తుచేసింది.

ఇలాంటిది ఆశించలేదు..

అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో అన్ని అంశాలనూ పరిశీంచకుండానే పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న నిర్ణయానికి కమిటీ రావడాన్ని ఎన్జీటీ తప్పుబట్టింది. మనసు పెట్టి తగిన గణాంకాలు, వివరాలను పరిశీలించకుండా.. అధికారులతో జరిపిన చర్చల ఆధారంగా.. ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ మందిపు నోటిఫికేషన్‌, 2006 పరిధిలోకి రాదని కమిటీ ప్రాథమికంగా నిర్ధారించిందని పేర్కొంది. పర్యావరణ పరిరక్షణ మార్గదర్శకులుగా ఉండాల్సిన కమిటీ నుంచి ఇలాంటిది ఆశించలేదని వ్యాఖ్యానించింది.

డీపీఆర్‌ ఆధారంగా ప్రభావ మదింపు అధ్యయనం చేపట్టనిదే.. ఈ ప్రాజెక్టు, గతంలో అనుమతించిన ప్రాజెక్టు వేరు కాదని చెప్పలేమని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో భారీ ఎత్తున భూసేకరణ చేపట్టాల్సి ఉన్నందున ఎక్కడి నుంచి కాలువలు తీస్తారో తెలియదని.. ఎకో సెన్సిటివ్‌ జోన్‌ లేదా వన్యప్రాణుల అభయారణ్యాల సరిహద్దుల లోపలి నుంచి కాలువలు తీస్తారో లేదో తెలియదని, ఈ అంశాలన్ని ప్రభావ మదింపు ద్వారా తెలుస్తాయని పేర్కొంది. ఈ వివరాలను సంయుక్త కమిటీ తన నివేదికలో పేర్కొనలేదని తెలిపింది.

కాగా.. ఏపీ సర్కారు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి, నారాయణపేట, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో తాగు, సాగు నీటి ఇబ్బందులు ఏర్పడతాయని.. పిటిషనర్‌గవినోళ్ల శ్రీనివాస్‌ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top