Sunday, 03 Oct, 2.59 am ఆంధ్రజ్యోతి

ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
రైతన్నలకు 'రివర్స్‌' కష్టాలు

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం బిందుసేద్యంపై నిర్లక్ష్యం చూప డం రైతులను కష్టాలపాలు చేస్తోంది. వైసీపీ సర్కార్‌ అనుసరిస్తున్న 'రివర్స్‌' విధానం రైతుల పాలిట శాపంగా మారింది. బిందుసేద్యం పరికరాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని సైతం రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. మరోవైపు ఎంప్యానెల్‌ కంపెనీలకు చెల్లింపులు బంద్‌ చేసింది. వాటికి ఇవ్వాల్సిన వందల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సబ్సిడీపై బిందు సేద్యం పరికరాల సరఫరాను ఆ సంస్థలు నిలిపేశాయి. ఫలితంగా భారీ ఖర్చుతో కూడుకున్న బిందు సేద్యం పరికరాలను సొంతంగా ఏర్పాటు చేసుకోలేక రైతులు బిందుసేద్యానికి దూరమవుతున్నారు. 2018-19లో రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల మంది రైతులు బిందుసేద్యం పరికరాలు పొందేందుకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. సర్కారు 'రివర్స్‌' పుణ్యమాని ప్రస్తుతం ఆ సంఖ్య కేవలం 111కి పడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గతంలో ఏపీఎంఐపీ వద్ద ఎంప్యానెల్‌ అయిన కంపెనీలకు బిల్లులు చెల్లించకుండా నిలిపివేశారు. 2019 నాటికి ఎంప్యానల్‌ అయిన 37 కంపెనీలకు రూ.300 కోట్లు బకాయిలు ఉండేవి. ప్రస్తుతం అవి సుమారు రూ. 1300 కోట్లకు చేరాయి. పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోవడంతో ఏడాది కాలంగా కంపెనీలు రైతులకు బిందుసేద్యం పరికరాల సరఫరాను నిలిపివేశాయి. 2020-21లో 1,48,163 మంది రైతులు బిందుసేద్యం పరికరాల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, ఒక్కరంటే ఒక్క రైతుకూ వాటిని అందివ్వలేదు. దీంతో 2021-22 లో రైతులు రిజిస్ట్రేషన్లకే మొగ్గు చూపడం మానేశారు. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 111 మంది రైతులు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వారిలో ఒక్కరికీ బిందుసేద్యం పరికరాలు అందివ్వలేదు.

బెడిసికొట్టిన 'రివర్స్‌'..!

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల్లోనూ రివర్స్‌ టెండరింగ్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. అయితే.. ఈ విధానం ఏపీఎంఐపీలో బెడిసికొట్టింది. ఎంప్యానెల్‌ కంపెనీలతో పాత ధరలకే బిందుసేద్యం పరికరాలు సరఫరా చేయించుకునే వెసులుబాటు ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా రివర్స్‌ విధానాన్ని అవలంభించింది. దీని కోసం రెండేళ్లు తర్జనభర్జన పడి తీరిగ్గా ఈ ఏడాది ఆగస్టు 26న టెండర్లు పిలిచింది. రైతులకు బిందుసేద్యం పరికరాలను సబ్సిడీపై సరఫరా చేసేందుకు టెండరు నోటిఫికేషన్‌ జారీ చేసి, దాఖలు చేయడానికి సెప్టెంబరు 15న గడువుగా నిర్దేశించింది. ఆ సమయానికి ఒక్కరూ టెండరు వేయలేదు. దీంతో మరో రోజు గడువు పొడిగించారు. రెండు కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. ఈ రెండు కంపెనీలకు బిందు సేద్యం రంగంలో ఎలాంటి అనుభవం లేకపోవడంతో అధికారులు టెండర్లు రద్దు చేశారు. వాస్తవానికి రివర్స్‌ టెండరింగ్‌ పిలవకముందు పీవీసీ రెసిన్‌ రూ.74 ఉంది. ఇప్పుడు దాని ధర రూ.175. అలానే డ్రిప్‌లో వాడే ఎల్‌ఎల్‌డీపీఈ, ఎల్‌డీపీఈ, హెచ్‌డీపీఈ వంటి ముడి పదార్థాలు గతంలో రూ.80 ఉండగా, నేడు రూ.105 ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడమన్నది మూర్ఖపు ఆలోచన అని అధికారులే చెబుతున్నారు.

మెట్ట ప్రాంత రైతుల కోసం 'మైక్రో ఇరిగేషన్‌'

మెట్ట రైతులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించాలన్న లక్ష్యంతో ఉమ్మడి ఏపీలో 2003లో ఆంధ్రప్రదేశ్‌ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు(ఏపీఎంఐపీ) పురుడుపోసుకుంది. ఇదే లక్ష్యంతో 2015 జూలైలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎ్‌సవై)ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. నీటిపారుదల రంగంలో పెట్టే ప్రతిపైసాకు మంచి ఫలితాన్ని రాబట్టడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. 'పర్‌ డ్రాప్‌.. మోర్‌ క్రాప్‌' పీఎంకేఎ్‌సవై నినాదం. బిందు సేద్యాన్ని ప్రోత్సహించడం ఇందులో భాగం. ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో బిందుసేద్యం ప్రాధాన్యాన్ని గుర్తించి ఏపీఎంఐపీని ప్రారంభించారు. నీటికొరత ఎక్కువగా ఉండే రాయలసీమ జిలా ్లల్లో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో బిందుసేద్యాన్ని పెద్ద ఎత్తున రైతులకు చేరువ చేశారు. మంచి ఫలితాలు సాధించారు. ఆ తర్వాత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హ యాంలోనూ బిందుసేద్యం పరికరాలను ఏర్పాటు చేయడంలో రాష్ట్రం ముందంజలో ఉండేది. 5 ఎకరాల్లోపు పొలం ఉన్న రైతులకు, ఎస్సీ, ఎస్టీలకు అయితే 100 శాతం సబ్సిడీతో అందించారు. ఇతర చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీతో ఇచ్చారు. 10 ఎకరాలోపు రైతులకు 70 శాతం సబ్సిడీ, 10 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు 50 శాతం సబ్సిడీ ఇచ్చేవారు. మొత్తం సబ్సిడీలో కేంద్రం 50 శాతం భరిస్తుంది. మిగిలిన సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందించేది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు బిందుసేద్యం పరికరాలను సరఫరా చేసేందుకు 37 కంపెనీలను గుర్తించారు. ఇవన్నీ ఏపీఎంఐపీతో ఒప్పం దం చేసుకుని, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు బిందుసేద్యం పరికరాలను రైతులకు అందించాల్సి ఉంది. రైతులు వీటిలో తమకు నచ్చిన కంపెనీని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇంత పకడ్బందీగా అమలు చేస్తున్న పథకంలోనూ వైసీపీ సర్కార్‌ 'రివర్స్‌' విధానం తీసుకొచ్చి రైతులకు ఎసరు పెట్టింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top