Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతు భరోసా నిధులు విడుదల

రైతు భరోసా నిధులు విడుదల

హైదరాబాద్: తెలంగాణలో రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తొలి విడతలో రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,482 కోట్లను నేరుగా జమ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

రైతుల పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 30 నెలల ప్రజాపాలనలో రైతు తలెత్తుకునేలా పాలన అందిస్తున్నామని అన్నారు. వ్యవసాయం దండగ కాదని, పండుగగా భావించే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పడే సమయానికి రాష్ట్ర అప్పు రూ.69 వేల కోట్లు ఉండగా, 2023 నాటికి అది రూ.8.11 లక్షల కోట్లకు చేరిందని అన్నారు. గత పదేళ్లలో దాదాపు రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన అప్పులు, తప్పుల భారం ఇప్పుడు తమ ప్రభుత్వం భరిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. 'బకాయిలు పెట్టింది బకాసురుడు... కట్టే పాపం మాకా?' అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు వాయిదాల పద్ధతిలో జీతాలు చెల్లించే పరిస్థితి నెలకొందని, ధనిక రాష్ట్రాన్ని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకెళ్లారని విమర్శించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలంగాణ పరువు తీశారని విమర్శించారు. ప్రస్తుతం ప్రజాపాలనలో ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద రూ.36 వేల కోట్లు రైతులకు అందించినట్లు సీఎం వెల్లడించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ నిలిపివేస్తారనే దుష్ప్రచారం చేశారని, కానీ 2004లో రైతులకు ఉచిత విద్యుత్‌ను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. రైతుల కోసం ప్రతి నెల సుమారు రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఉచిత విద్యుత్ కోసం రూ.30 వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.4 వేల కోట్లు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం రూ.80 వేల కోట్లు వ్యయం చేసినట్లు సీఎం రేవంత్ వివరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy