Thursday, 28 Jan, 9.26 pm ఆంధ్రజ్యోతి

జాతీయం-అంతర్జాతీయం
రైతులను చంపేందుకు బీజేపీ కుట్ర: కన్నీళ్లతో రాకేశ్

న్యూఢిల్లీ: నిరసనలో ఉన్న రైతులను చంపేందుకు భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తోందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సరిహద్దులోకి 3 లక్షల మంది పోలీసులు తుపాకులు, లాఠీలతో వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో ఈ విషయమై మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గుక్క ఆపుకోలేని ఏడుపుతోనే మీడియాతో మాట్లాడారు.

''వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకుంటే నా దేశ రైతాంగానికి తీవ్రంగా నష్టం జరుగుతుంది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే. నిరసనలో ఉన్న రైతులను ఖాళీ చేయించేందుకు 3 లక్షల మంది పోలీసులను పంపిస్తున్నారు. యూపీ నుంచి ఢిల్లీ నుంచి పోలీసులు లాఠీలు, తుపాకులతో వస్తున్నారు. ఘాజీపూర్ సరిహద్దులో చాలా మంది రైతులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. రైతులను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది. ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాకేశ్ టికాయత్ ఇక్కడి నుంచి కదలడు'' అని మీడియాకు కన్నీళ్లతో రాకేశ్ టికాయత్ తన ఆవేదనను చెప్పుకున్నారు.

దీనికి కొద్ది సమయం ముందు ఘాజీపూర్ సరిహద్దులో నిర్వహించిన బహిరంగ సభలో రాకేశ్ మాట్లాడుతూ ''ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ సరిహద్దుల్లోకి బలగాలను పంపాలని చూస్తోంది. మాపైకి నిజంగానే బలగాలను పంపిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ప్రభుత్వం మాపై కావాలనే కేసులు పెడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి లొంగిపోయేది లేదు'' అని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top