Monday, 21 Sep, 2.04 pm ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
రైతులతో గోక్కున్నోడు ఎవడూ బాగుపడలేదు: తలసాని

హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ సంఖ్యా బలాన్ని పక్కనబెట్టి కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించుకున్నారని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరేలా బిల్లు ఉందన్నారు. బీజేపీ నేతలు అడ్డు అదుపు లేదని భ్రమల్లో ఉన్నారన్నారు. జమ్మూకాశ్మీర్, చైనా, పాక్ సరిహద్దుల్లో యుద్ధం రాగానే మైలేజీ వస్తుందని బీజేపీ పాలకులు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇష్టం లేకపోయినా... దేశ ప్రయోజనాల మేరకు జీఎస్టీకికి అంగీకరించారని తెలిపారు. కరోనా కష్ట కాలంలో కనీసం తెలంగాణను ఆదుకోలేదని ఆయన మండిపడ్డారు. ఐసీఎమ్‌ఆర్ గైడ్ లైన్స్ ప్రకారం తెలంగాణలో కరోనా మరణాలను తగ్గించామని తెలిపారు. తెలంగాణలో రెవెన్యూ చట్టంపై విస్తృత చర్చ జరిగిందని... రైతులకు నష్టం కలిగించే చట్టంపై రాజ్యసభలో కనీస చర్చ జరగనివ్వలేదని దుయ్యబట్టారు. కరోనా టైంలో బీజేపీ నేతలు ప్రభుత్వాలను కూల్చే పని చేసిందని మండిపడ్డారు.

2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం జేఎన్నారమ్ కింద హైదరాబాద్ శివార్లలో 91 చోట్ల 45,951 ఇల్లు కట్టారని...శివార్లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో 90 శాతం హైదరాబాద్ నగర వాసులకే కేటాయిస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. రాజ్యసభలో వెంకయ్యనాయుడుకి వ్యవసాయ బిల్లు ఇష్టం లేదు కాబట్టే సీట్లో కూర్చోలేదని చెప్పుకొచ్చారు. రైతులతో గోక్కున్నోడు ఎవడు బాగుపడలేదని.. రాబోయే కాలంలో బీజేపీ అనుభవిస్తుందని హెచ్చరించారు. కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ దేశ వ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top