జీడీపీ వృద్ధి అంచనా 6.7 శాతానికి పెంపు
ద్రవ్యోల్బణం అంచనా 5 శాతానికి తగ్గింపు
ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలక వడ్డీ (రెపో) రేటును యథాతథంగా కొనసాగించింది.
రెపో రేటును మార్చకపోవడం వరుసగా ఇది నాలుగోసారి. దీంతో రెపోరేటు ప్రస్తుత 5.25 శాతంగా కొనసాగనుంది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ).. రెపో రేటు యథాతథ స్థితికి ఏకగ్రీవంగా ఓటు వేసింది. అలాగే, వడ్డీ రేట్లపై భవిష్యత్ వైఖరిని సైతం తటస్థంగానే కొనసాగించింది. పశ్చిమాసియాలో సంక్షోభ ఫలితంగా భారీగా పెరిగిన ఇంధన ధరలతో ద్రవ్యోల్బణంపై పూర్తి స్థాయి ప్రభావానికి సంబంధించి మరింత స్పష్టత వచ్చేవరకు వేచి చూడనున్నట్లు ఎంపీసీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) జీడీపీ వృద్ధి అంచనాను 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. అంతేకాదు, ద్రవ్యోల్బణం అంచనాను 5.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఇప్పటివరకు అంతగా లేకపోయినప్పటికీ.. ఆహారం, ఇంధనం, ముడి సరుకుల ధరల పెరగుదల ముప్పుతో ద్రవ్యోల్బణం దీర్ఘకాలంపాటు గరిష్ఠ స్థాయిలో కొనసాగే ప్రమాదం ఉందని ఆర్‌బీఐ హెచ్చరించింది. జీడీపీ విషయానికొస్తే, పశ్చిమాసియా సంక్షోభం, వాణిజ్య ఆంక్షలు, ఉద్రిక్తతల నేపథ్యంలోనూ భారత జీడీపీ మెరుగైన వృద్ధిని నమోదు చేసిందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. సమృద్ధికరంగా ఉన్న దేశీయ వినియోగం, తయారీ, సేవల కార్యకలాపాలతో పాటు బలమైన ఎగుమతులు ఇందుకు దోహదపడ్డాయంది. అయితే, లోటు వర్షపాతం, ఎల్‌నినో పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వాణిజ్య అవరోధాలతో భవిష్యత్ వృద్ధిపై అనిశ్చితి నెలకొందని ఆర్‌బీఐ హెచ్చరించింది.
కొత్త అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు రాబోతున్నాయ్..
త్వరలో కొత్త అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు (పట్టణ సహకార బ్యాంకులు) రాబోతున్నాయి. 20 ఏళ్లకు పైగా కాలం తర్వాత మళ్లీ కొత్త అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుల ఏర్పాటుకు లైసెన్సులు జారీ చేయనున్నట్లు సమీక్ష అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. బడా బ్యాంకుల తరహాలో వీటికి కూడా ఆన్ టాప్ పద్ధతిలో లైసెన్సులు జారీ చేయనున్నట్లు.. ఇందుకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే, రూరల్ కో-ఆపరేటివ్ బ్యాంకుల (గ్రామీణ సహకార బ్యాంకులు)కు సంబంధించి 2008లో జారీ చేసిన క్రెడిట్ మానిటరింగ్ అరేంజ్‌మెంట్ (సీఎంఏ) ఉత్తర్వులను సమీక్షించనున్నట్లు మల్హోత్రా తెలిపారు.
వడ్డీ రేట్లలో మరింత పారదర్శకత
రుణాలపై వడ్డీ రేట్ల నిర్ణయంలో పాదర్శకత పెంపు, ద్రవ్య పరపతి విధానాల ప్రయోజనాలను లబ్ధిదారులకు చేరవేసే ప్రక్రియను మరింత పటిష్ఠం చేయడంతోపాటు వినియోగదారుల రక్షణను బలోపేతం చేసేందుకు తమ నియంత్రిత సంస్థల వడ్డీ రేట్ల పర్యవేక్షణ నియమావళిని హేతుబద్ధీకరించనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది.

యూపీఐ లావాదేవీల ప్రాసెసింగ్
ఖర్చు ఎవరో ఒకరు భరించాల్సిందే
డిజిటల్ చెల్లింపులపై ఎండీఆర్ విధింపుపై తామిప్పుడే వ్యాఖ్యానించలేమని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. యూపీఐ లావాదేవీలపై రుసుము వసూలుకు సంబంధించిన విధివిధానాల కోసం వేచి చూడాలని ఆయన సూచించారు. చెల్లింపుల వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల్లో పెట్టుబడులు కూడా కీలకమేనన్న గవర్నర్.. యూపీఐ లావాదేవీల ప్రాసెసింగ్ వ్యయాన్ని ఎవరో ఒకరు భరించాల్సిందేనని పునరుద్ఘాటించారు. 'మన ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. సాధారణ ప్రజానీకం పన్నుల రూపంలో ఈ మూల్యాన్ని చెల్లించడం.. లేదంటే, ఎండీఆర్ వసూలు చేయడం' అని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు
'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

