Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రిటైర్ అవుతానని అనుకున్నారు.. కానీ నా లక్ష్యం అదే: రొనాల్డో

రిటైర్ అవుతానని అనుకున్నారు.. కానీ నా లక్ష్యం అదే: రొనాల్డో

ఇంటర్నెట్ డెస్క్: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో తనపై వచ్చిన విమర్శలకు మైదానంలోనే సమాధానం ఇచ్చాడు. ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ గ్రూప్-కే మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన అతడు..

జట్టుకు 5-0 తేడాతో ఘన విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ఆరు వేర్వేరు ప్రపంచ కప్‌లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో బరిలోకి దిగిన రోనాల్డో.. డీఆర్ కాంగోతో జరిగిన తొలి మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగియగా.. రొనాల్డో ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడు ఇక ఆడే సామర్థ్యాన్ని కోల్పోయాడని.. రిటైర్‌మెంట్ సమయం దగ్గర పడిందంటూ పలువురు విమర్శించారు. అయితే ఉజ్బెకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న రొనాల్డో విమర్శకులకు గట్టిగా బదులిచ్చాడు.

'ఈ వారం నాకు అస్సలు కలిసిరాలేదు. నా జీవితంలో ఇదొక చీకటి వారంగా మిగిలిపోయింది. ఒక్క మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతే.. రిటైర్‌మెంట్ సమయం దగ్గర పడిందని విమర్శించారు. కానీ ధైర్యంగా నిలబడ్డాను. ఆ విమర్శలనే ఆదర్శంగా తీసుకున్నాను. నా కష్టంపై నాకు నమ్మకం ఉంది. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది. నా సహచర ఆటగాళ్లు కూడా నాకు అండగా నిలిచారు. క్లిష్టమైన పరిస్థితుల నుంచి బలంగా తిరిగి రావడం సంతోషంగా ఉంది' అని రొనాల్డో వెల్లడించాడు.

నా లక్ష్యం అదే..

ఆరు వేర్వేరు ప్రపంచ కప్‌లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచిన ఘనతపై కూడా రొనాల్డో స్పందించాడు. 'రికార్డులు బద్దలు కొట్టడం ఎప్పుడూ ఆనందమే. కానీ నా ప్రధాన లక్ష్యం జాతీయ జట్టుకు విజయాలు అందించడం. జట్టు లక్ష్యాలను చేరుకోవడమే నాకు అన్నింటి కంటే ముఖ్యం' అని తెలిపాడు. భవిష్యత్తులో లియోనెల్ మెస్సి నేతృత్వంలోని అర్జెంటీనాతో తలపడే అవకాశంపై రొనాల్డోకి ప్రశ్న ఎదురైంది. 'ఆ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. కానీ అలాంటి మ్యాచ్ జరిగితే మాత్రం అద్భుతంగా ఉంటుంది' అని రొనాల్డో వ్యాఖ్యానించాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy