Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోజుకు 3.70 లక్షల మంది ప్యాసింజర్లు!

రోజుకు 3.70 లక్షల మంది ప్యాసింజర్లు!

  • నాగోల్‌-ఎయిర్‌పోర్టు కారిడార్‌ రైడర్‌ షిప్‌ లెక్కలివి

  • రెండో దశలో అత్యధికంగా ప్రయాణించే వారు ఈ మార్గంలోనే...

  • మొత్తం 7 కారిడార్లలో 12.42 లక్షల మంది ప్రయాణికులు

  • 2028-30 మధ్యలో రాకపోకలపై డీపీఆర్‌ రూపకల్పన

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్ నగరంలో మెట్రో రెండోదశ విస్తరణలో భాగంగా చేపడుతున్న 7 కారిడార్లలో రోజుకు 12.42 లక్షల మంది రాకపోకలు సాగించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశకు అనుసంధానంగా చేపడుతున్న ఆయా మార్గాలను ఎక్కువ మంది ప్రయాణికులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించిన డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)లో రైడర్‌షిప్‌ లెక్కలను పొందుపరిచారు.

 ప్రధానంగా సెకండ్‌ ఫేజ్‌లో ప్రతిపాదించిన నాగోల్‌-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (36.8 కిలోమీటర్లు) అతిపెద్ద కారిడార్‌లో 2028-2030 మధ్యలో రోజుకు 3.70 లక్షల మంది ప్రయాణిస్తారని అందులో పేర్కొన్నారు. రూ.38,595 కోట్లతో రెండో దశ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 17శాతం రూ.6,666, రాష్ట్ర ప్రభుత్వ వాటా 31శాతం రూ.11.933, బ్యాంకుల నుంచి తీసుకునే రుణాల వాటా 52 శాతం రూ.19,996 కోట్లు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ను సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తోంది.

 కారిడార్లు అందుబాటులోకి వస్తే..

మొదటి దశ ప్రాజెక్టులో మూడు కారిడార్లలో 69.2 కిలోమీటర్ల మేరకు పనులు చేపట్టారు. ప్రస్తుతం ఆయా మార్గాల్లో రోజుకు 4.75 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నగరంలో రెండో దశలో ప్రతిపాదించిన 7 కారిడార్లలో 112.9 కిలోమీటర్ల పనులు వీలైనంత త్వరగా అందుబాటులోకి వస్తే.. పెద్ద ఎత్తున మెట్రో రవాణా అందనుంది. వాస్తవంగా పనుల నిమిత్తం నగరానికి రోజుకు లక్షలాది మంది వస్తుంటారు. ఇందులో దాదాపు 20 శాతం మంది తమ సొంత కార్లు తీసుకొస్తుంటారు. మరికొందరు క్యాబ్‌ల్లో ప్రయాణిస్తుంటారు. అలాగే నగర జనాభాలో సుమారు 65 శాతం మంది కార్లు,

ద్విచక్ర వాహనాలతోపాటు ఆటోలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో నగర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ జామ్‌లే కనిపిస్తుంటాయి. ప్రధానంగా వర్షాలు కురిసిన సమయంలో కిలోమీటరు దూరానికి సైతం దాదాపు అరగంటపాటు పడుతున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండో దశ రైళ్లు సకాలంలో పట్టాలెక్కితే.. ట్రాఫిక్‌ బాధల నుంచి లక్షలాది మందికి ఉపశమనం లభిస్తుందని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారులు భావిస్తున్నారు. అలాగే కాలుష్యాన్ని పెద్దఎత్తున నియంత్రించవచ్చని పేర్కొంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మెట్రో రెండో దశ అనుమతుల విషయాన్ని త్వరగా పట్టించుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy