హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ డ్రగ్ ఫ్రీ సిటీ' ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది.
రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇప్పుడు నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు.. 190 మందికి పాజిటివ్
భాగ్యనగరంలో పెరుగుతున్న నేరాలకు మత్తు పదార్థాలే కారణమని గుర్తించిన పోలీసులు, రౌడీషీటర్ల పని పట్టేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రౌడీషీటర్లను పిలిపించి వారికి డ్రగ్ కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రౌడీషీటర్లపై ఉక్కుపాదం..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రౌడీషీటర్లందరినీ నిశితంగా గమనిస్తున్న పోలీసులు, వారి ప్రవర్తనలో మార్పులు రావడానికి ప్రధాన కారణం మత్తు పదార్థాలని తేల్చారు. కమిషనరేట్ పరిధిలో సుమారు 1300 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొదటి విడతలో సుమారు 250 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేసిన 250 మందిలో ఏకంగా 190 మందికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అంటే సుమారు 75శాతం మంది రౌడీషీటర్లు మత్తుకు బానిసైనట్లు స్పష్టమవుతోంది. పాజిటివ్ వచ్చిన వారిలో ఎక్కువమంది గంజాయికి అలవాటు పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
సీపీ సజ్జనార్ కీలక చర్యలు: రీహ్యాబిటేషన్ వైపు అడుగులు..
నేరస్థులను కేవలం జైలుకు పంపడం ద్వారా మార్పు రాదని సీపీ సజ్జనార్ భావించారు. ఈ సమస్యను మూలాల నుంచి తొలగించాలని నిర్ణయించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన రౌడీషీటర్లను పోలీసులు వెంటనే రీహాబిలిటేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. వారిని మత్తు నుంచి బయట పడేసి, సాధారణ పౌరులుగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం. వెస్ట్ జోన్ పరిధిలో 20 మందికి పాజిటివ్ రావడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వారిని ఉంచి విచారిస్తున్నారు. రౌడీషీటర్లకు గంజాయి, ఇతర డ్రగ్స్ ఎక్కడి నుంచి అందుతున్నాయి?, వీటి వెనుక ఉన్న ప్రధాన నిందితులు ఎవరు? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.
మత్తు పదార్థాల నెట్‌వర్క్‌పై చర్యలు..
మత్తు పదార్థాల ప్రభావంతో రౌడీషీటర్లు విచక్షణ కోల్పోయి దాడులు, హత్యలు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మత్తులో ఉన్నప్పుడు నేరం చేసేందుకు ఏమాత్రం వెనుకాడకపోవడంతో భాగ్యనగరంలో అశాంతి నెలకొంటోంది. ఈ క్రమంలో డ్రగ్ టెస్టులు నిర్వహించడం ద్వారా వారిని కట్టడి చేయడమే కాకుండా, మత్తు నెట్‌వర్క్‌ను ఛేదించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
భవిష్యత్తు కార్యాచరణ..
హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ఈ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం రౌడీషీటర్లే కాకుండా, డ్రగ్స్ సరఫరా చేసే పెడ్లర్లపై కఠినమైన పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. నగరంలో శాంతికి విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా యువతను పక్కదారి పట్టిస్తున్న మత్తు మహమ్మారిని అంతం చేసేందుకు ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. ఈ భారీ ఆపరేషన్ ద్వారా హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు వస్తే నేరాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. భాగ్యనగరంలో మరిన్ని ఆపరేషన్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చర్యల వల్ల నేరాల రేటు తగ్గుతుందని పోలీసులు చెబుతున్నారు.
.
పొంగులేటి అవినీతి చిట్టా బయటపెట్టింది మేమే.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ హయాంలో ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారు: ఎంపీ రఘునందన్ రావు
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం..!
Read Latest Telangana News And AP News And International News And Telugu News

