రాజమహేంద్రవరం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కేసులో నిందితుడు సాధిక్ ఖాన్‌పై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) సంచలన ఆరోపణలు చేశారు.
సాధిక్ ఖాన్ కరుడుగట్టిన నేరస్థుడని అన్నారు. నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డి విద్యకు అవసరమైన ఖర్చును తానే భరిస్తానని భరోసా కల్పించారు. రావులపాలెంలో ఈరోజు (సోమవారం) భాస్కర్ రెడ్డిని, మనవడు కార్తికేయ రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో విజయసాయి మాట్లాడారు.
సాధిక్ వల్ల ఆ కుటుంబాలు అన్యాయానికి గురయ్యాయి..
సాధిక్ వల్ల హిందూమతంలో ఉన్న రెడ్డి కుటుంబం, బీసీ కుటుంబాలు అన్యాయానికి గురి అయ్యాయని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. నూకరాజు కుటుంబంలో ముగ్గురు మరణించడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని అన్నారు. సాధిక్.. ఏఈ నూకరాజు ఆస్తులను బ్యాంకు లాకర్లను, స్థలాలను రాయించుకున్నాడని ఆరోపించారు. ఫోన్లను బలవంతంగా లాక్కున్నాడని అన్నారు. రూ.2 కోట్ల బంగారం, రూ.2 కోట్ల నగదు, రావులపాలెంలో ఉన్న రూ.10 కోట్ల భూమిని, కాకినాడలో ఉన్న మరో భూమిని, జగదీశ్వర్ రెడ్డి ఇన్సూరెన్స్ సొమ్మును నిందితుడు సాధిక్ ఖాన్ లాక్కున్నాడని ఆరోపించారు. నిందితుడు సాధిక్ అనేకసార్లు కార్తికేయ రెడ్డిని హింసించాడని తెలిపారు. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డిని సాధిక్ కొట్టాడన్నారు. కెనడా నుంచి ముంబైకి స్లో పాయిజన్ తీసుకువచ్చి హైదరాబాద్‌లో జగదీశ్వర్ రెడ్డికి ఇచ్చాడని ఆరోపించారు.
ప్రతి హిందువు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి..
స్లో పాయిజన్ ఇచ్చిన తర్వాత జగదీశ్వర్ రెడ్డి మరణించారని విజయసాయి రెడ్డి తెలిపారు. సౌజన్య మరణ వాంగ్మూలాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రతి కుటుంబం, ప్రతి మహిళ, ప్రతి హిందువు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. హిందూ సమాజానికి చెందిన ప్రతి ఒక్కరూ ఈ విషయంపై స్పందించాలన్నారు. టీడీపీ, వైసీపీ నేతలు ఈ విషయంపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు, జగన్ ఎందుకు ముందుకు రావట్లేదని నిలదీశారు. ఈ కేసుపై ప్రతిపక్షం ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ఏ మతాన్ని తాను కించపరచడం లేదని చెప్పారు.
ఆ ట్రీట్‌మెంట్ ఇక్కడ అమలు చేస్తా..
ఎవరికి ఏ అన్యాయం జరిగినా తాను స్పందిస్తానని విజయసాయి రెడ్డి తెలిపారు. తాను అధికారంలో ఉంటే యూపీలో ఉన్న ట్రీట్‌మెంట్ ఇక్కడ అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. ఏపీలో మతమార్పిడి వ్యతిరేక బిల్లును సీఎం చంద్రబాబు ఎందుకు తీసుకురావట్లేదని ప్రశ్నించారు. ఏపీలో సాధిక్ ఖాన్ లాంటి ముఠాలు అనేకం ఉన్నాయని విజయసాయి రెడ్డి ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి...

