కౌంటర్లు వేయాలని సీఎస్, డీజీపీకి ఆదేశాలు
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): సచివాలయ శిఽథిలాలు సందర్శించేందుకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, హోంశాఖ ముఖ్యకార్యదర్శికి, డీజీపీకి, హైదరాబాద్ సీపీలకు నోటీసులు జారీచేసింది. ఈ మేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. సచివాలయ శిఽథిలాలు చూసేందుకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వరరెడ్డిలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యం సోమవారం ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది టి. రజనీకాంత్‌రెడ్డి వాదించారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది సంతోష్ విచారణకు హాజరయ్యారు.
ఈ కేసులో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హాజరై వాదనలు వినిపిస్తారని, ఆయన ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారని, రెండు వారాలు గడువు ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం.. రెండు వారాలు వాయిదా వేసింది.