Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సైన్స్, ఆధ్యాత్మికతల మేళవింపు

సైన్స్, ఆధ్యాత్మికతల మేళవింపు

వేసవి సెలవుల్లో నేను నా శ్రీమతి, ఇద్దరు పిల్లలతో కలిసి గుజరాత్‌లోని సోమనాథ్‌, ద్వారకలను సందర్శించా. హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి రాత్రి బయలుదేరి పుణే, వాసాయి రోడ్‌, సూరత్‌ మీదుగా మరుసటిరోజు సాయంకాలం వడోదరకు చేరుకున్నాం.

ఈ ప్రయాణంలో అనేక సొరంగాల గుండా వెళ్తూ కొత్త అనుభూతిని పొందాం.

మరుసటిరోజు ఉదయాన్నే బయలుదేరి పోయిచ అనే గ్రామంలోని 'స్వామి నారాయణ మందిర్‌' దర్శించుకొని... కెవాడియాలోని ఏక్తానగర్‌ చేరుకున్నాం. ఇది నర్మదా నది తీరాన ఉన్న ఒక అద్భుత పర్యాటక ప్రాంతం. 'స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ' (ఐక్యతా ప్రతిమ) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (182 మీటర్లు) సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని పిల్లలు చూసి అబ్బురపడ్డారు. భారతదేశాన్ని ఏకం చేయడంలో... ముఖ్యంగా హైదరాబాద్‌ నిజాం రాజ్యం భారతదేశంలో విలీనం కావడానికి పటేల్‌ చేసిన కృషిని సవివరంగా తెలుసుకున్నారు. వ్యూయింగ్‌ గ్యాలరీలో... విగ్రహం గుండె భాగంలో (135 మీటర్ల ఎత్తులో) ఉన్న గ్యాలరీ నుంచి నర్మదా నది, సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ అందాలను చూడటం మర్చిపోలేని అనుభూతి. సాయంత్రం వేళ విగ్రహంపై ప్రదర్శించే లేజర్‌ షో ద్వారా ఆయన జీవిత చరిత్రను దృశ్యరూపంలో ఎంతో ఆసక్తిగా వీక్షించాం. రాత్రి సమీపంలోని హోటల్‌లో బస చేసి... మర్నాడు ఉదయమే బయలుదేరి, మధ్యాహ్నం అహ్మదాబాద్‌కు చేరుకున్నాం.

 అక్వాటిక్‌ గ్యాలరీ... అద్భుతం...

అహ్మదాబాద్‌... ఆధునికతతో పాటు ప్రాచీన సంస్కృతి కలగలిసిన అద్భుతమైన నగరం. గుజరాత్‌ సైన్స్‌ సిటీ దాదాపు 107 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ సైన్స్‌ సిటీలో అనేక ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విషయాలను తెలుసుకోవచ్చు. అక్వాటిక్‌ గ్యాలరీ... ఇది భారతదేశం లోనే అతిపెద్ద అక్వేరియంలలో ఒకటి. నీటి అడుగున సొరంగం గుండా నడుస్తూ... సొరచేపలను చూడొచ్చు. రోబోటిక్స్‌ గ్యాలరీలో వివిధ రకాల పనులు చేసే 200కు పైగా రోబోలను చూశాం. రోబోలు డాన్స్‌ చేయడం, వంట చేయడం చూసి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) శక్తిని తెలుసుకున్నాం. ేస్పస్‌ అండ్‌ ప్లానెటోరియంలో నక్షత్ర మండలాలు, ఇస్రో రాకెట్ల నమూనాలు పిల్లల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇవన్నీ చూసే సరికి సాయంకాలమయ్యింది. ఆ రాత్రి హోటల్‌లో బసచేశాం.

ఉదయం సబర్మతి ఆశ్రమానికి వెళ్ళాం. మహాత్మాగాంధీ నివసించిన ఆశ్రమాన్ని సందర్శించడం ద్వారా స్వాతంత్య్ర పోరాట చరిత్రను, గాంధీజీ సరళమైన జీవన విధానాన్ని తెలుసుకున్నాం. అక్కడి నుంచి అటల్‌ బ్రిడ్జి సందర్శించాం. అదొక అద్భుత నిర్మాణం. అలాగే పురాతన అదాలజ్‌ మెట్ల బావి తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. నగరానికి సమీపంలో ఉన్న ఈ మెట్ల బావి ఒక చారిత్రక కట్టడం. ఐదంతస్తుల ఈ బావి గోడలపై అద్భుతమైన శిల్పకళ, రాతి చెక్కడాలు కనిపిస్తాయి. నాటి శిల్పుల కళా నైపుణ్యానికి ఇదొక నిదర్శనం.

 అరేబియా తీరాన సోమనాథ్‌...

మరుసటి రోజు ఉదయాన్నే అహ్మదాబాద్‌ నుంచి బయలుదేరి సాయంకాలం మొదటి జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ్‌కి చేరుకొని అక్కడి హోటల్‌రూమ్‌లో బసచేశాం. ఉదయమే సోమనాథ్‌ మందిరంలోని పరమ శివుడిని దర్శించుకున్నాం. సోమనాథ్‌ ఆలయం అరేబియా సముద్ర తీరాన ఉన్న విశిష్ట నిర్మాణం. విదేశీ దండయాత్రల వల్ల ఈ ఆలయం ఎన్నిసార్లు ధ్వంసమైనా, తిరిగి ఎలా పునర్నిర్మితమైందో తెలుసుకుని ఆశ్చర్యపోయాం. బాణ స్తంభం... ఆలయ ప్రాంగణంలోని ఈ స్తంభం నుంచి దక్షిణ ధృవం దాకా మధ్యలో ఎలాంటి భూభాగం (నేల) లేదనే ఖగోళ, భౌగోళిక నిజాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయాం.

అతిపొడవైన కేబుల్‌ వంతెన...

తర్వాతి రోజు ఉదయాన్నే ఇక్కడికి సమీపాన ఉన్న 'బాలికా తీర్త్‌' (శ్రీ కృష్ణుడి నిర్యాణం జరిగిన ప్రదేశం) దర్శించుకొని... అక్కడి నుంచి మా యాత్ర చివరి ఘట్టంగా శ్రీకృష్ణుడి లీలాభూమి అయిన ద్వారకను దర్శించుకున్నాం. గోమతి నదిలో స్నానం చేసి, ద్వారకాధీశ ఆలయంలో శ్రీకృష్ణున్ని వీక్షించాం. అక్కడే సుదర్శన్‌సేతు ఓఖా నుంచి బేట్‌ ద్వారకను కలుపుతూ సముద్రంపై నిర్మించిన... భారతదేశపు అతిపొడవైన కేబుల్‌ వంతెనపై ప్రయాణించడం సరికొత్త రోడ్డు ప్రయాణ అనుభవాన్ని అందించింది. ద్వారకకు సమీపంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వరాలయానికి చేరుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాం. ఆ తర్వాత ద్వారకకు ప్రయాణమై... మరుసటి రోజు ఉదయం రైలులో హైదరాబాద్‌కు చేరుకున్నాం.

  • పుత్తూర్‌ శరత్‌కుమార్‌, 99595 15876

ఈ వార్తలు కూడా చదవండి:

తూర్పు కనుమల్లో 'జలమిత్రులు'

సాహసం శ్వాసగా... సాగిపో...

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy